సీసీ కెమెరాలు ప్రజల భద్రతకు భరోసాగా నిలుస్తాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అందుకే నగర వ్యాప్తంగా వచ్చే 100 రోజుల్లో ఎంపిక ...
సీసీ కెమెరాలు ప్రజల భద్రతకు భరోసాగా నిలుస్తాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అందుకే నగర వ్యాప్తంగా వచ్చే 100 రోజుల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 50 వేల కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వారు చెప్పారు. ప్రజా భద్రత చట్టం, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వారు చెప్పారు.
సీసీ కెమెరాల ఆవశ్యకత, వాటి ఏర్పాటు కార్యప్రణాళికను గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, పోలీస్‌కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు సంయుక్తంగా విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కెమెరాల వల్ల ప్రజలకు భద్రత కలగడంతోపాటు నేరాల శాతం కూడా తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడ్డారు. ముందుగా పోలీస్‌స్టేషన్ వారీగా 100 పోలీస్ స్టేషన్ల పరిధిలో, అనంతరం జోన్లవారీగా కెమెరాలను ఏర్పాటు చేయాలని నిశ్చయించినట్లు తెలిపారు. అలాగే ముందుగా ప్రధాన రహదారులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సమస్యాత్మక ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ప్రజాభద్రత చట్టంపై ఇప్పటికే పోలీస్, జీహెచ్ఎంసీ సహా వివిధ ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పలు సమావేశాలు నిర్వహించినట్లు, త్వరలోనే వీటి ఏర్పాటుకు కార్యప్రణాళికను సిద్ధంచేసి టెండర్ల ప్రక్రియ చేపడతామన్నారు. కెమెరాల ఏర్పాటు, సక్రమంగా నిర్వహించేందుకు త్వరలో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే పక్షంరోజుల్లో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధంచేసే స్థాయీసంఘం ఆమోదం తీసుకుంటామన్నారు.
మొదటిదశ కెమెరాల ఏర్పాటుకు 100 రోజుల డెడ్‌లైన్ విధించుకున్నట్లు తెలిపారు. దశలవారీగా మొత్తం నగరంలో 50వేల కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ తరహాలో భారీస్థాయిలో కెమెరాల ఏర్పాట్లు దేశంలోనే మొదటిసారని, దీనికి రూ. 400 నుంచి రూ. 450 కోట్లవరకూ ఖర్చవుతుందన్నారు. పోలీసు, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్‌బోర్డు, ప్రధాన రోడ్లు, మెట్రోరైలు కారిడార్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అన్ని కెమెరాలనూ ఇంటర్లింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కెమెరాలవల్ల దొంగలు, నేరగాళ్లలో భయం ఏర్పడి నేరాలు తగ్గే అవకాశముందన్నారు. కెమెరాల్లో రికార్డయ్యే ఫుటేజ్లపై ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం నగరంలోని 350 జంక్షన్లలో కెమెరాలను కంట్రోల్‌రూంకు అనుసంధానంచేసి పరిశీలిస్తున్నామన్నారు. దుకాణదారులంతా దీనికి సహకరించాలని కోరారు. అంతకు ముందు కెమెరాల పనితీరుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.