త్వరలో కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. తెలంగాణ రాజముద్రతో ఉండే ఈ కొత్త రేషన్ కార్డులను ఇటీవల జరిపిన సమగ్ర సర్వే ఆధారంగా పంపిణీ చేస...
త్వరలో కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. తెలంగాణ రాజముద్రతో ఉండే ఈ కొత్త రేషన్ కార్డులను ఇటీవల జరిపిన సమగ్ర సర్వే ఆధారంగా పంపిణీ చేస్తారు. ఆధార్‌కార్డులు లేకున్నా కార్డులు ఇస్తారు. కచ్చితంగా అర్హులకు మాత్రమే రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. సర్వేలో అర్హులని తేలిన ప్రతివారికీ ఈ కార్డులు అందనున్నాయి.
గత ప్రభుత్వాల హయాంలో రేషన్‌కార్డులు ఇష్టారాజ్యంగా జారీచేస్తూ వచ్చారు. దీనితో రాష్ట్ర జనాభాను మించి కార్డుల పంపిణీ జరిగింది. మరోవైపు కార్డుల కోసం లక్షల దరఖాస్తులు అందాయి. ఆనాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 లక్షల పైచిలుకు కుటుంబాలు ఉండగా 91,84,991 రేషన్ కార్డులు (అన్నపూర్ణ కార్డులు 16,760 కలుపుకుని) జారీ చేశారు. ఫలితంగా ప్రతినెల 15 లక్షల 7 వేల 599 కార్డుల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన వెంటనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ అక్రమాల మీద మూడో కన్ను తెరిచారు. ఓవైపు సమగ్ర సర్వేకు ఆదేశించడంతో పాటు అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా స్వచ్ఛందంగా 11 లక్షల కార్టులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యాయి.
సర్వేతో పెరుగనున్న కుటుంబాలు
సర్వేపై ప్రతిపక్ష పార్టీలు బురద చల్లాయి. రేషన్‌కార్డుల ఏరివేత కోసమే సర్వే అంటూ కొందరు నాయకులు విమర్శలు కూడా గుప్పించారు. అయినా ప్రభుత్వం చెక్కుచెదరకుండా సర్వేను కొనసాగించింది. రాష్ట్రంలో కంప్యూటరీకరణ పూర్తయిన లెక్కలను బట్టి బుధవారం వరకు 92 లక్షల 22 వేల కుటుంబాలు నమోదయ్యాయి. సుమారు కోటి 6 లక్షల కుటుంబాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో అర్హత గల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆధార్ అనుసంధానం లేకున్నా సరే..
రేషన్ కార్డుల క్రమబద్ధీకరణలో భాగంగా ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నప్పటికీ..అర్హత కలిగిన ఎవరికైనా అనివార్య పరిస్థితుల్లో ఆధార్ లేకున్నా రేషన్ కార్డులు జారీచేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వనుంది. ఐతే కార్డు పొందిన తర్వాత ఆధార్ పొందవలిసి ఉంటుంది. ఇందుకోసం జిల్లాల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. అంతేగాకుండా బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా కిందిస్థాయి సిబ్బంది వల్ల నిజమైన లబ్ధిదారులకు ఎక్కడైనా ఇబ్బందులు కలిగిందని తెలిస్తే వెంటనే కార్డుల పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.