-ఆడేందుకు స్థలాలు గుర్తించాలి -ఆయాప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి -ఈమేరకు జాబితాలు సిద్ధం చేయండి -అధికారులకు కలెక్టర్ ఆదేశం ...
-ఆడేందుకు స్థలాలు గుర్తించాలి
-ఆయాప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి
-ఈమేరకు జాబితాలు సిద్ధం చేయండి
-అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఆదిలాబాద్ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించినందున జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం జగన్మోహన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా ఉద్యోగులు, ప్రజల సహకారంతో జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలతోపాటు డివిజన్, జిల్లా కేంద్రంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో బతుకమ్మ ఆడేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. డీఆర్డీఏ, మెప్మా, పంచాయతీ దేవాదాయ శాఖల అధికారులను జాబితాలు అందజేయాలన్నారు.
ఆయాకేంద్రాల్లో కోలాటంలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బతుకమ్మ ఆడే ప్రాంతంలో విద్యుత్ దీపాలు, రోడ్డు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, కుంటలు, చెరువుల్లో బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా గజ ఈతగాళ్లను నియమించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. 40 నుంచి 50 మంది మహిళా బృందాలతో జిల్లా నుంచి టాబ్లాయిడ్‌ను అక్టోబర్ 2 నాటికి పంపించాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ ప్రసాద్‌రావు, డీఆర్డీఏ పీడీ వేంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీ, ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ రుక్మిణమ్మ పాల్గొన్నారు.