హైదరాబాద్, (టీమీడియా):ప్రభుత్వం ఓ చోట భూమిని వేలం వేస్తుంది. తాహతును బట్టి మనం కొంటాం. రిజిస్ట్రేషన్ ఛార్టీలతో సహా డబ్బులు చెల్లిస్తాం. అ...
హైదరాబాద్, (టీమీడియా):ప్రభుత్వం ఓ చోట భూమిని వేలం వేస్తుంది. తాహతును బట్టి మనం కొంటాం. రిజిస్ట్రేషన్ ఛార్టీలతో సహా డబ్బులు చెల్లిస్తాం. అది అప్పగించేలోగా ఏదో కోర్టు కేసు వచ్చి పని ఆగిపోతుంది. భూమి కావాలనుకుంటే ఆగుతాం. ఎదురుచూస్తాం. కానీ ఓరోజు హఠాత్తుగా మనకు చెప్పకుండానే ఆ భూమినే ఇంకెవరికో అమ్మేస్తే ఏం చేస్తాం. ఇదేమిటని నిలదీస్తాం. ఇస్తే ఆ భూమి తీసుకుంటాం. లేదా మరోచోట వారు చూపించే భూమి నచ్చితే తీసుకుంటాం.
ఎలాగూ ముందు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టేశాం.. కాబట్టి తాజా రిజిస్ట్రేషన్ మినహాయించమంటాం...సరిగ్గా రాయదుర్గం భూమి విషయంలో జరిగింది ఇదే. కొద్ది రోజులుగా టీడీపీ నేతలు.. సీమాంధ్ర మీడియా మిన్నూ మన్ను ఏకం చేసి నానా యాగీ చేస్తున్న రాయదుర్గం భూ వివాదం వెనక జరిగింది ఇంతే. ఈ భూమిని అమ్మకానికి పెట్టింది కాంగ్రెస్ సర్కారు. వేలం పాటల్లో పెట్టింది. అమ్మింది... అదే భూమిని చెప్పాచేయకుండా మరో కంపెనీకి కేటాయించింది కూడా ఆ సర్కారే. ఆ భూమికి బదులు మరో భూమి కేటాయించింది.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయించింది... అన్నీ ఆ ప్రభుత్వ నిర్ణయాలే. ఆ సీఎం ఇచ్చిన మెమోకు అమలు ఆదేశాలు వచ్చింది మాత్రం తెలంగాణ ప్రభుత్వ కాలంలో. విచిత్రంగా ఆ భూమి ని తెలంగాణ ప్రభుత్వమే వేలం వేసి అక్రమంగా కట్టబెట్టిందా? ఇతరుల భూమిని బదలాయించిందా? అన్నట్టుగా టీడీపీ నేతలు వారి తైనాతీలు ప్రచారాలు సాగిస్తున్నారు.
ఇదీ కథాక్రమం...
2006, ఫిబ్రవరి 23: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వేనెంబర్ 83/1లోని 424.13 ఎకరాల భూమిలో ఐటీ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఆ భూమిని రెవెన్యూ శాఖనుంచి ఏపీఐఐసీకి బదలాయించింది.
2007: ఆ తర్వాత ఆ భూములను వేలానికి పెట్టింది. ఈ భూమిని మైహోం కంపెనీ, డీఎల్ఎఫ్, పూరంకర, ఐటీసీ వంటి ప్రముఖ సంస్థలు కొనుగోలు చేశాయి. మైహోం కంపెనీకి చెందిన ఆక్వాస్పేస్ సంస్థ 31.35 ఎకరాలను ఎకరాకు రూ.20కోట్ల చొప్పున మొత్తం రూ. 627 కోట్లకు కొనుగోలు చేసింది. రూ. 35 కోట్లు స్టాంపు డ్యూటీ చెల్లించింది. ఈలోగా ఈ సర్వే నెంబర్ మీద సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని వెల్లడైంది. అంటే అధికారులు ఏ విషయం చూసుకోకుండానే వేలం పాటలు నిర్వహించారన్న మాట. ఈ విషయమై ప్లాట్ల కొనుగోలుదారులంతా ఏపీఐసీసీ అధికారులతో చర్చలు జరిపారు.
2010: దీనిపై కోర్టుల్లో ఉన్న కేసులు తొలగిపోయాయి. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
2013 సెప్టెంబర్ 6: ఏపీఐఐసీ ఈ ప్లాట్ల అమ్మకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిపింది. ఆక్వా స్పేస్ 34.83 కోట్లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ మేరకు వారికి ఈ భూమిని కేటాయిస్తూ అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. తర్వాత వారు నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్ఎంసీని ఆశ్రయించారు. ఈ ప్రాంతంలో హెరిటేజ్ రాక్స్ ఉన్నాయని అనుమతులు కుదరవని జీహెచ్ఎంసీ సంస్థ చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించింది.
2003 జనవరి 2న ప్రభుత్వమే ఈ సర్వే నెంబర్‌ను వారసత్వ సంపదగా గుర్తిస్తూ జీవో 4 జారీ చేసిందని వెల్లడైంది. ఈ విషయాన్ని నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా విచారణకు కమిటీలు వేశారు. ఆ కమిటీ రెండు కంపెనీలకు చెందిన ప్లాట్లు హెరిటేజ్ పరిధిలోకి వచ్చాయని తెలిపింది. ఆ రెండు కంపెనీలకు అక్కడే ప్రత్యామ్నాయ స్థలాలు చూపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
2014 జనవరి 3: ఏపీఐఐసీ సీఎండీ రెండు కంపెనీలతో చర్చించారు. ఆ మేరకు వారు ప్రత్యామ్నాయ స్థలాలు చూపారు. అందులో ప్లాట్ల నెం. 22, 23, 24, 31, 32, 33, 30ఏ ప్లాట్లను ఆక్వాకంపెనీ ఎంచుకుంది. కానీ అదేనెల 10న ఆ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా కోరిన చోట ప్రభుత్వం గేమింగ్ పార్కుకు శంకుస్థాపన చేసింది. దీనితో ఆందోళనకు గురైన కంపెనీలు ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఆందోళనకు దిగారు. తర్వాత వివిధ రాజకీయ పార్టీలు రంగ ప్రవేశం చేయడంతో గేమింగ్పార్కుకు ప్రత్యామ్నాయంగా స్థలం చూపుతామని ప్రతిపాదిత ప్రదేశాన్ని రెండు కంపెనీలకు ఇస్తామని నాటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
2014 ఫిబ్రవరి 13: ఈ కంపెనీలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించడంతో పాటు స్టాంపు డ్యూటీ సర్దుబాటు చేస్తూ మెమో విడుదల చేశారు. ఈ మేరకు 28వ తేదీన ఏపీఐఐసీ ఆక్వా కంపెనీకి కేటాయింపు లెటర్ అందచేసింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
2014 జూలై 19: ఫిబ్రవరి 13వ తేదీనాటి మెమోను అమలు చేయడానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదీ జరిగింది.
కుట్రల మీద కుట్రలు...: రాష్ట్రం విభజన జరిగిన అనంతరం తెలంగాణను నాశనం చేయడానికే కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీ వీలున్న అన్ని అంశాల్లో తెలంగాణను నష్ట పరుస్తూనే వచ్చింది. రాష్ట్రం ఏర్పడీ ఏర్పడకముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అందులో ఉన్న సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కేంద్రంపై ఒత్తిడితెచ్చి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించింది. విద్యుత్ ఇబ్బందులను పెంచాలనే కుట్ర కోణం కూడా ఇందులో ఉంది. ఆ తర్వాత విద్యుత్ ఒప్పందాలు చెల్లవంటూ అనేక కొర్రీలు పెడుతూ వచ్చింది.రైతులు విద్యుత్‌కోతలతో అల్లాడుతుంటే వికృతానందాన్ని పొందింది. అంతటితో ఆగకుండా పారిశ్రామికవేత్తలతో జరిపే సమావేశాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. తర్వాత హైదరాబాద్‌లో రక్షణ అంటూ గగ్గోలు పెట్టి గవర్నర్ పాలన తేవడానికి యత్నించింది.
టీడీపీకి ఇది అలవాటే..: తెలంగాణ మీద విషం కక్కడం. తమ తోకమీడియా సహకారంతో నిందలు వేయడం భంగపడడం టీడీపీ నాయకులకు మామూలే. గతంలో కేసీఆర్ వంశమూలాల మీద దుష్ప్రచారం చేయగా దానికి దీటైన ఆధారాలతో వాస్తవాలు బయటపడడంతో కంగు తిన్నారు. మెడికల్ ఫీజుల విషయంలో కూడా వందల కోట్లు చేతులు మారాయని వీరంగాలు వేసి చివరకు విదూషకుడుగా మిగిలిపోయిన విషయం కూడా తెలిసిందే.ఆ విషయంలో కేసుకూడా బుక్కయింది.
మొదట మెట్రోకు ఈ అంశాన్ని ముడిపెట్టాలని యత్నించి విఫలమై ఇపుడు ఎలా బయటపడాలో తెలియక తికమక పడుతున్నట్టుగా రేవంత్ వైఖరి కనిపిస్తున్నది. అన్ని రకాల నిర్ణయాలు కాంగ్రెస్ హయాంలో తీసుకున్నవే కావడంతో వారి ప్రయత్నాలు వ్యర్థమైపోతున్నాయి. మరోవైపు పదేపదే కుల సంబోధనలకు దిగడం పార్టీలోనే నిరసనలకు ముఖ్యనాయకుల ఆగ్రహానికి కారణమవుతున్నది.
బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే యత్నం..
అన్ని కుట్రలు తట్టుకుని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుండడంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే పకడ్బందీ కుట్ర ప్రారంభమైంది. తెలంగాణ సచివాలయంలోని ఆంధ్ర ఉద్యోగుల కుమ్మక్కుతో మెట్రోరైలు లేఖల ప్రచురణతో ఈ కుట్ర మొదలైంది. టీడీపీకి ఆస్థాన ప్రచారకులుగా ఉన్న రెండు పత్రికలకు మాత్రమే ఈ లేఖలు అందడం దాన్నే ధృవ పరుస్తుంది. మెట్రో వెళ్లిపోతున్నదంటూ మీడియా గగ్గోలు పెట్టింది.
ఇందులో రెండు కోణాలున్నామని విశ్లేషకుల భావన. ఒకటి మెట్రోరైలు నిర్మాణ సంస్థకు మేలు చేకూర్చడం. అదే సమయంలో హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చేయడం రెండోది. మొదట్లో రాయదుర్గం భూమికి మెట్రోకు ముడిపెట్టిన టీడీపీ నేతలు ఇపుడు మెట్రో మాటెత్తడం లేదు. అది వదిలేసి కులకోణాన్ని తెర మీదికి తేవడం గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న స్టాంపుడ్యూటీ సర్దుబాటును టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగట్టే విఫల యత్నాలు చేస్తున్నారు. అయితే వాస్తవాలు మాత్రం వారికి సహకరించడం లేదు.