-మాట నిలబెట్టుకున్న టీ సర్కారు - మంత్రుల కమిటీ సిఫారసులకు సీఎం ఆమోదం - హైదరాబాద్ : రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర సర్కారు మాట నిల...
-మాట నిలబెట్టుకున్న టీ సర్కారు
- మంత్రుల కమిటీ సిఫారసులకు సీఎం ఆమోదం
- హైదరాబాద్ : రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర సర్కారు మాట నిలబెట్టుకుంది. తెలంగాణ రైతాంగానికి లక్ష రూపాయలవరకు పంటరుణాన్ని మాఫీ చేస్తూ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రుణమాఫీ విధి విధానాలను తయారు చేసేందుకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో నియమించిన మంత్రుల కమిటీ ఇవాళ తమ సిఫారసులను సీఎం కేసీఆర్‌కు అందజేసింది. మంత్రుల కమిటీ నివేదికకు సీఎం ఆమోదం తెలిపారు. మొత్తం 17 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
సీఎం నిర్ణయంతో 36లక్షల రైతులు ప్రయోజనం పొందనున్నారు. నాలుగు విడతల్లో రుణమాఫీని అమలు చేయనున్నారు. మొదటి విడతగా రూ. 4,250 కోట్ల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తెలంగాణ రైతాంగం ఎంతో ఊరట చెందుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకులు రైతు రుణాలను రెన్యూవల్ చేస్తాయని ఆయన స్ఫష్టం చేశారు.
ఈ నెలఖారులోగా కొత్త రుణాలు పొందకుంటే రైతులు పంట బీమా సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉన్నందున తొందరగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం ఆలస్యమైతే వచ్చే నెలలో రైతులపై ఫైన్ పడేదని సీఎం వివరించారు. రుణమాఫీ నిర్ణయం నేపథ్యంలో మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ బ్యాంకర్లతో సమావేశం కానుంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి పోచారం
హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ రైతురుణమాఫీపై ఏర్పాటైన సబ్‌కమిటీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన అనంతరం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని పోచారం వెల్లడించారు.
ఈ రుణమాఫీ ద్వారా దాదాపు 36 లక్షల మంది రైతులు లబ్దిపోందుతారని వెల్లడించారు. మొత్తం రూ.17 వేల కోట్లకు పైగా రుణమాఫీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రుణమాఫీ కోసం తొలివిడతగా 4 వేల 250 కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు. బ్యాంకులకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేయనున్నట్టు స్పష్టం చేశారు. రైతులు ఖరీఫ్ పంట నష్టపోకుండానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇకపై కూడా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీని పర్యవేక్షించడానికి కలెక్టర్లకు అధికారాలు కట్టబెడుతున్నామన్నారు.
మనసుంటే మార్గముంటది : ఈటెల
హైదారబాద్: రైతు రుణమాఫీకి నిధులెక్కడి నుంచి తెస్తారని మాట్లాడినోళ్లకు ఇది చెంప పెట్టని మంత్రి ఈటెల అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే అన్నీ వస్తాయని, మనసుంటే మార్గముంటదన్నారు. రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు, ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలు అవలంభించిన విధానాలే కారణమని ఆర్థికమంత్రి ఈటెల విమర్శించారు. ఇవాళ సచివాలయంలో రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ చిత్తశుద్ధితో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేశాడని వివరించారు.
సబ్ కమిటీ వేగంగా చర్చలు జరిపి సీఎంకు నివేదిక ఇచ్చిందని దీనిపై సీఎం కేసీఆర్ అరగంటలోనే నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని బాధపెట్టొద్దనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రూ.480 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని రైతులకు అందజేశామని తెలిపారు. రుణమాఫీ నిధుల విడుదలపై రేపటి నుంచి బ్యాంకర్లతో చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారని వివరించారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేశాయని ఈటెల మండిపడ్డారు.
ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ రైతు రుణమాఫీయే కాదు దసరా, దీపావళి తర్వాత మిగతా హామీలన్ని నెరవేర్చుతామని స్పష్టం చేశారు. వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, బీడి కార్మికులకు పెన్షన్న్లు ఇస్తామని తెలిపారు.