కార్పోరేట్ ఆసుపత్రుల పేరిట చలామణి అవుతూ ఆరోగ్యశ్రీ ముసుగులో అడ్డగోలుగా దోచేస్తున్న ఆసుపత్రులకు చెక్ పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ...
కార్పోరేట్ ఆసుపత్రుల పేరిట చలామణి అవుతూ ఆరోగ్యశ్రీ ముసుగులో అడ్డగోలుగా దోచేస్తున్న ఆసుపత్రులకు చెక్ పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ పలు మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఒకే రోగానికి జిల్లాలలో ఉన్న సాధారణ ఆసుపత్రిలో అదే ఖర్చు, హైదరాబాద్ లో ఉన్న కార్పోరేట్ ఆసుపత్రికి అదే ఖర్చు చెల్లించడం మూలంగా ఎవరు లాభపడుతున్నారు ? రోగికి ఎలాంటి వైద్యం అందుతుంది ? ఈ విధానం మూలంగా ఎలాంటి సౌకర్యాలు లేని ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటుంటే .. అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రులు నష్టపోతున్నాయి. అందుకే దీనిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించారు.
తెలంగాణలోని 50 పడకలున్న ఆసుపత్రి సి గ్రేడుగా, 200 పడకలున్న ఆసుపత్రి బి గ్రేడు, 200 పైన పడకలున్న ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఎ గ్రేడుగా విభజించాలని నిర్ణయించారు. దీనికి ప్రత్యేకంగా ఓ ప్రముఖ సర్వే సంస్థకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆసుపత్రిల సేవలు, అందులో నాణ్యతా ప్రమాణాలను బట్టి ఈ కమిటీ గ్రేడ్లుగా విభజిస్తుంది. ఆ ఆసుపత్రిలో ఉన్న పడకలకు సరిపడా సిబ్బంది ఉన్నారా ? ఏడాదిలో ఆ ఆసుపత్రిలో సంభవించిన మరణాలు ఎన్ని ? ఐసీయూలో ప్రమాణాలు ఎలా ఉన్నాయి ? ఆసుపత్రిలో ఉన్న వైద్యులు ఎంతమంది ? అందులో ప్రత్యేక నిపుణత కలిగిన వైద్యులు ఎంతమంది ? ఆసుపత్రి పేర్కొన్న విధంగా ఉద్యోగులు ఉన్నారా ? వారు సరిగ్గా విధులకు హాజరవుతున్నారా ? ఆసుపత్రిలో మందులు, ఇంజక్షన్ల నిలువలో ప్రమాణాలు పాటిస్తున్నారా ? ఆసుపత్రి లోపల, బయట మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రత, తాగునీటి వ్యవస్థ ఎలా ఉంది ? అన్న అంశాల మీద పూర్థిస్థాయి విచారణ జరిపిన తరువాత ఆ ఆసుపత్రికి గ్రేడు నిర్ణయిస్తారు.