-నాలుగు గ్రామాల్లో అంతులేని అవినీతి -దాదాపు కోటి 50 లక్షలు పక్కదారి -నేటితో ఇందిరమ్మ ఇళ్ల విచారణ పూర్తి -రేపు వివరాల వెల్లడి...
-నాలుగు గ్రామాల్లో అంతులేని అవినీతి
-దాదాపు కోటి 50 లక్షలు పక్కదారి
-నేటితో ఇందిరమ్మ ఇళ్ల విచారణ పూర్తి
-రేపు వివరాల వెల్లడి
-30లోగా సర్కారుకు తుది నివేదిక
-చర్యలు తప్పవని సీఐడీ హెచ్చరిక
-అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
(ఆదిలాబాద్) : గృహనిర్మాణ సంస్థలో అంతట అవినీతి జరిగినట్లు తెలుస్తున్నా సీబీసీఐడీ అధికారులు ఎక్కువ మంజూరు, ఎక్కువ బిల్లులు తీసుకున్న నాలుగు గ్రామాలను తమ విచారణ కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ గ్రామాల్లోనే ఎక్కుగా అవినీతి జరిగి ఉంటుందని సీఐడీ అధికారులు వేసిన అంచనాలు తప్పకాదు. విచారణలో వెలుగు చూసిన నిజాలను పూర్తి ఆధారలతో ప్రభుత్వానికి నివేదించేందుకు సీఐడీ అధికారులు సిద్ధపడుతున్నారు. విచారణ చేపట్టిన కిష్టాపూర్, బాబాపూర్, ఖానాపూర్లలో దాదాపు విచారణ ముగిసిందని, మిగిలింది ఒక్క గిన్నెర మాత్రమేనని తెలుస్తోంది. ఇప్పటికే తమ దృష్టికి వచ్చిన అవినీతిని సీఐడీ అధికారులు ఎప్పటి కప్పుడు రికార్డు చేసుకుంటూ వస్తున్నారు. గిన్నెరలో మంజూరైన ఇళ్లు మొత్తం 526 ఉండగా గురువారం ఇక్కడ 30 ఇళ్ల వరకు విచారణ పూర్తిచేసినట్లు సీఐడీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. శుక్రవారం దాదాపు పూర్తవుతుందని ఆయన చెబుతున్నారు.
-కోటి 50 లక్షల దాకా అక్రమాలు?
ఈ నాలుగు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో దాదాపు కోటి 50 లక్షల అవినీతి జరిగి ఉంటుందని సీఐడీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలి పోయిన మరో 500 ఇళ్ల విచారణ పూర్తయితే పక్కా అంచనాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. విచారణలో అక్రమాలు వెల్లడవుతున్న తీరు సీబీసీఐడీ అధికారులనే విస్తుగొల్పుతోంది. ఈ నాలుగు గ్రామాల్లో ఎక్కడ చూసిన అవినీతి ఒకే రీతిలో కనిపిస్తోందని వారు చెబుతున్నారు. పునాదుల స్థాయిలో ఉన్న ఇళ్లకు పూర్తయినట్లు బిల్లులు తీసుకోవడం, పాత ఇళ్లకు ఇందిరమ్మ ముద్రవేసి బిల్లులు దండుకోవడం, బినామీల పేరిట ఇళ్లు మంజూరు చేసుకుని బిల్లులు కాజేయడం, ఇళ్లు మంజూరైన విషయం లబ్ధిదారులకు తెలియకపోవడం, వారి పేరిట మరొకరు బిల్లులు లేపడం వంటి అవినీతి చర్యలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఖానాపూర్లో ఎక్కువగా సిమెంట్ కుంభకోణం జరిగినట్లు సమాచారం. మొత్తంగా 5 వేల బస్తాలు ఎటు వెళ్లాయనేది లెక్కలేదని అధికారులు అంటున్నారు. ఇక మహిళా గ్రామైక్య సంఘాల నుంచి 50 నుంచి 60 లక్షల వరకు లబ్ధిదారులకు బిల్లులు చెల్లించ లేదని తెలుస్తోంది.
-500లకుపైగా కేసులు?
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మొదలైన తర్వాతనే ఈ సంస్థలో మితిమీరిన అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోంది. 2006-07 నుంచి 2008-09 వరకు మూడు విడతల్లో జిల్లాకు 814 కోట్లతో 53, 963 ఇళ్లు మంజూరు చేశారు. ఈ సమయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు, ఈఓపీఆర్డీలు, ఇతర శాఖల అధికారులను మండల హౌసింగ్ అధికారులుగా నియమించి మంజూరు అధికారం ఇచ్చారు. బిల్లులు చెలించేందుకు మహిళా సంఘాలకు అధికారం ఇచ్చారు. ఈ సమయంలోనే అవినీతి రెక్కలు విచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ సమయంలో విధులు నిర్వహించిన అన్ని స్థాయిల అధికారుల అవినీతిని సీబీసీఐడీ బట్టబయలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రత్యక్షంగా సంబంధాలున్న అధికారులతోపాటు పరోక్ష పాత్రను పోషించి డబ్బులు దండుకున్న అప్పటి ప్రజాప్రతినిధులను కూడా వదిలే అవకాశం లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గత నెల 7న గృహ నిర్మాణ సంస్థ పీడీ గంగారం ఫిర్యాదు మేరకు సీబీసీఐడీ అధికారులు క్రైం నంబర్ 6/14 ద్వారా 406, 409, 420, 120/బీ ఐపీసీ కింద కేసు నమోదు చేసిన తర్వాతనే విచారణ ప్రారంభించారు. దీంతో కేసులో నిందితులను తప్పని సరిగా చేర్చాల్సిన అవసరం ఉంటుంది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాల్సి వస్తుంది. అక్రమాలకు పాల్పడిన వారిలో అధికారులతోపాటు మధ్య దళారులు, లబ్ధిదారులను కూడా చేర్చే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లాలో 500లకుపైగా మందిపై కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుల్లో వచ్చే ప్రతిస్పందననుబట్టి ప్రభుత్వం మిగతా ఇళ్లపైనా విచారణ సాగిస్తుందా, ఇంతటి ఆగిపోతుందా అనేది ఆసకి ్తకలిగిస్తోంది. నిజానికి నాలుగు గ్రామాల్లోనే ఇంత పెద్ద అవినీతి వెలుగు చూస్తే జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపితే కళ్లు తిరిగే అక్రమాలు వెలుగు చూడక తప్పదేమో..
-పద్మావతి నగర్లో విచారణ
ఖానాపూర్ : పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల అవినీ తి విచారణ నెల రోజులుగా నడుస్తోంది. రోజురోజుకూ కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వ స్తున్నాయి. పద్మావతి నగర్లో ఒక పాత పెంకుటిల్లుకు యజమానికి సంబంధం లేకుండా మూడు ఇళ్ల బిల్లులను ఇచ్చినట్లు రాశారు. అ లాగే అనేక చోట్ల పాత ఇళ్లకే బిల్లులు ఇచ్చినట్లు తేలింది. వీవో గ్రూపుల్లో ఎక్కువగా అవినీతి జరుగుతుందని సీఐడీ అధికారులు తెలిపారు. విచారణ పూర్తి స్థాయికి రావాలంటే మరికొంత సమయం పడుతుందని సీఐ రఘు తెలిపారు.