-30 వేల మంది పోలీసులతో బందోబస్తు -1150 సీసీ కెమెరాలతో నిఘా -ఊరేగింపునకు ప్రత్యేక రూట్ -హుస్సేన్‌సాగర్ చుట్టూ 33 క్రేన్లు ...
-ఊరేగింపునకు ప్రత్యేక రూట్
-హుస్సేన్‌సాగర్ చుట్టూ 33 క్రేన్లు
-కలెక్టరేట్లో కంట్రోల్ రూం
-360 ప్రత్యేక బస్సులు, 8 ఎంఎంటీఎస్ రైళ్లు
-నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్
వినాయక నిమజ్జనానికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. సోమవారం నిర్వహించే ఊరేగింపు కోసం1150 సీసీ కెమెరాలను ఉపయోగించనున్నారు. కంట్రోల్ రూంకు వీటిని అనుసంధానం చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. 30వేల మంది పోలీసు బలగాలతో అడుగడుగునా బందోబస్తు నిర్వహించనున్నారు. 29 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చెరువుల వద్ద భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. క్రమపద్ధతిలో నిమజ్జనం కోసం టోకెన్లు ఇవ్వనున్నారు. నిమజ్జనాన్ని తిలకించడానికి వచ్చే జనం కోసం 360 బస్సులు, 8ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నారు. అత్యవసర సాయానికి కలెక్టరేట్లో కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు మద్యం దుకాణాల బంద్ పాటించాలని పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
-ఉదయం 9 నుంచే ట్రాఫిక్ ఆంక్షలు
నిమజ్జనం ఊరేగింపు నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు నగరంలోని అన్ని ప్రధానమార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పరిస్థితిని బట్టి ఆంక్షలు పొడిగించే అవకాశం ఉంది. దూరప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు శివార్లలోని కూడళ్ల నుంచే రాకపోకలు సాగిస్తాయి. సిటీబస్సులు కూడా ట్యాంక్‌బండ్ సమీపంలోని ప్రధాన ప్రాంతాల వరకే నడుస్తాయి.
ప్రధానయాత్ర
బాలాపూర్ గణనాథుడితో ప్రారంభమయ్యే శోభాయాత్ర పాతబస్తీ మీదుగా 22.7 కిలోమీటర్లు సాగి హుస్సేన్‌సాగర్‌కు చేరుకుం టుంది. ఈ యాత్ర ప్రధానమైనది కావడంతో పోలీసులు, అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. ఆయా రోడ్లపై వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు బల్దియా అధికారులు సకల ఏర్పాట్లు చేశారు.
-పార్కింగ్ ప్రదేశాలివే..
హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చేవారికి పోలీసులు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్భవనం, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, రంగారెడ్డి జడ్పీ కార్యాలయం, బుద్దభవన్ వెనుక వైపు, గోసేవాసదన్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ ఆలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాంకాలేజీ, పబ్లిక్గార్డెన్లలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. నిమజ్జన వాహనాలు వచ్చే మార్గాల్లో కార్లు, ఇతర వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.
-కలెక్టరేట్లో కంట్రోల్‌రూం
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు. సమస్యలుంటే 040-23202813కు ఫోన్‌చేయాలని..ఇది సోమవారం ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. అలాగే నగర పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 040-27852482, 27852486, 9010203626లకు ఫోన్‌చేసి సమాచారమివ్వాలని కమిషనర్ కోరారు.
