-పనులు నిలిపేసే ఆలోచన మాకు లేదు -ఉత్తరప్రత్యుత్తరాలు అత్యంత సహజం -ప్రభుత్వంనుంచి పూర్తి సహకారముంది -మీడియాతో ఎల్అండ్టీ మెట్రో సీ...
-పనులు నిలిపేసే ఆలోచన మాకు లేదు
-ఉత్తరప్రత్యుత్తరాలు అత్యంత సహజం
-ప్రభుత్వంనుంచి పూర్తి సహకారముంది
-మీడియాతో ఎల్అండ్టీ మెట్రో సీఈవో గాడ్గిల్
-అభాసుపాలు చేయడం సరికాదు: ఎల్అండ్టీ
హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీసేలా కొన్ని పత్రికలు తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నాయని ఎల్అండ్టీ మెట్రోరైల్, హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీబీ గాడ్గిల్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రభుత్వ సహకారంతోనే ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నామని చెప్పారు.
మెట్రో ప్రాజెక్టు నుంచి వైదొలగాలని ఎల్అండ్టీ భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందంటూ కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, సీఎస్ రాజీవ్‌శర్మతో గాడ్గిల్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టినప్పుడు అందులో ఉండే సమస్యలపై ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు నెరపడం అనేది చాలా సహజమని, అదేమి క్రిమినల్ చర్య కాదని అన్నారు.
రాష్ట్రం రెండుగా విడిపోక ముందు నుంచే అంటే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచే, వివిధ అంశాలపై తాము ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీనే కొన్ని సమస్యలను పేర్కొంటూ నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాశామని, అలాగే ఈనెల 10వ తేదీన కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఓ లేఖ రాశామని చెప్పారు. అయితే.. తాజా లేఖలోని కొన్ని అంశాలను, పాత లేఖలోని కొన్ని అంశాలను కథనాలు ప్రచురించిన పత్రికలు కలిపేశాయని ఆరోపించారు.
ప్రాజెక్టును మధ్యలో ఆపివేసే ఆలోచన ఏది ప్రస్తుతానికి తమకు లేదని స్పష్టం చేశారు. ఒప్పందాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికీ ఇది వయబుల్ ప్రాజెక్టుగానే ఎల్అండ్టీ భావిస్తున్నదని తెలిపారు. దేశంలో ఏ ప్రాజెక్టులో జరుగనంత వేగంగా హైదరాబాద్‌లో పనులు చేస్తున్నామని చెప్పారు. మెట్రోరైలు మార్గంలో అలైన్మెంట్ మార్చాలని ఇంత వరకు అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని, కేవలం సుల్తాన్‌బజార్, అసెంబ్లీ ఎదురుగా మాత్రమే ప్రభుత్వం కొన్ని సూచనలు చేసిందన్నారు.
సమస్యలు ఉన్నప్పుడు సానుకూలంగా చర్చించుకునే సామర్ధ్యం తమకు ఉందని, ఎవరితో వైరం పెట్టుకోవాలన్న ఆలోచన తమకు లేదని గాడ్గిల్ చెప్పారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి ఆధారం లేకుండా కొన్ని అంశాలనే ప్రస్తావిస్తూ వార్తలు ప్రచురించాయని చెప్పారు. ఊహాజనితమైన కథనాలతో పెద్ద ప్రాజెక్టులకు అవాంతరాలు సృష్టించకూడదని వాటికి హితవు పలికారు. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా రెండు పార్టీలకు డామేజ్ కలిగించేలా కథనాలు రాయటం ఎంత మాత్రం సముచితం కాదని, ఈ విషయంలో ఎల్ అండ్ టీ ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ కూడా విచారం వ్యక్తం చేసిందని గాడ్గిల్ తెలిపారు. మెట్రోరైలుపై అసత్య కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. గాడ్గిల్ సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేస్తామని అంశాన్ని లేఖలో ప్రస్తావించారా? అన్న మరో ప్రశ్నకు.. సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వానికి ఎన్నో అంశాలపై లేఖలు రాస్తుంటామని, అందులో అది కూడా ఓ అంశమై ఉండొచ్చని చెప్పారు. అయితే.. దీనికి ఒప్పందాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రాజెక్టును నిలిపి వేసే ఆలోచనేది ప్రస్తుతానికి తమ సంస్థకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ముందుకు సాగుతామని గాడ్గిల్ తెలిపారు.
అసత్య ప్రచారం తగదు: ఎల్అండ్టీ
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఓ వర్గం మీడియా అసత్య ప్రచారం చేయటం తగదని పేర్కొంటూ ఎల్అండ్టీ కమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ సంజయ్‌కపూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతున్నదని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో గతంలో ఏపీ సర్కారుతో అనేక సంప్రదింపులు జరిగాయని, అలాగే తెలంగాణ ప్రభుత్వంతో నిరంతరం సాగుతుంటాయని అన్నారు.
ఎల్అండ్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాధారణమని, ఇదేం కొత్త కాదని తెలిపారు. వాస్తవాలు, పూర్తి వివరాలు, సమాచారం తెలుసుకోకుండా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అభాసుపాలు చేయాలని చూడటం సరికాదన్నారు. మెట్రో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని, పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. దేశంలోనే వేగంగా సాగుతున్న ప్రాజెక్టు ఇదని స్పష్టం చేశారు. ఇలాంటి కథనాలు రాయటం బాధాకరంగా ఉందని, ప్రజలను తప్పుదోవ పట్టించటం సరికాదని ఆ ప్రకటనలో తెలిపారు.