దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నగరాలకు ప్రతి ఏటా ఇండియా టుడే ఇచ్చే అవార్డుల్లో ఈ ఏడాది తెలంగాణకు రెండు పురస్కారాలు ద...
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నగరాలకు ప్రతి ఏటా ఇండియా టుడే ఇచ్చే అవార్డుల్లో ఈ ఏడాది తెలంగాణకు రెండు పురస్కారాలు దక్కాయి. ఆర్థిక విభాగంలోనూ, గృహవసతిలోనూ హైదరాబాద్ నగరానికి ఈ అవార్డులు దక్కాయి. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయు డు ఢిల్లీలో శుక్రవారం రాత్రి ప్రదానం చేసిన అవార్డులను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ అందుకొన్నారు.
ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా వివిధ రంగాల్లో కనీసంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తున్నదని, ఆర్థికంగా దేశంలోని అన్ని నగరాల్లోకంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నదని తేలింది. అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్ ఖ్యాతి ఇనుమడించింది: రామచంద్రుఇండియా టుడే పన్నెండు విభాగాల్లో ప్రకటించిన అవార్డుల్లో రెండు విభాగాల్లో హైదరాబాద్ తొలిస్థానంలో ఉండడం సంతోషకరమని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ అన్నారు. అవార్డులు అందుకున్న అనంతరం రామచంద్రు తేజావత్ టీ మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి రెండు అవార్డులు రావడం ద్వారా తెలంగాణ ఖ్యాతి దేశస్థాయిలో ఇనుమడించినట్లయిందని అన్నారు.
గృహవసతి రంగంలో హైదరాబాద్ నగర ప్రత్యేకతను ఇండియా టుడే గుర్తించిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇటీవల ప్రవేశపెట్టిన రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణం కేవలం పట్టణాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలవుతుండటంతో గృహవసతి రంగంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు వచ్చే సంవత్సరానికి గుర్తింపు పొందుతుందని అన్నారు.
