చంద్రబాబు నాయుడు దున్నపోతు ఈనిందంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు దూడను కట్టెయ్యనీకె పలుపు దేవులాడుకుంట తిర్గుతరని తెలంగాణ జనాలకు ఎప్పుడ...
చంద్రబాబు నాయుడు దున్నపోతు ఈనిందంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు దూడను కట్టెయ్యనీకె పలుపు దేవులాడుకుంట తిర్గుతరని తెలంగాణ జనాలకు ఎప్పుడో తెలుసు. తెలంగాణ ఉద్యమంలో రెండు కళ్ల సిద్దాంతంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండ విఫలయత్నాలు చేసిన చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో రెండు రాష్ట్రాలు సల్లగుండాలె అంటూ కొత్త రాగం ఎత్తుకుని తెలుగోళ్లంత ఒక్కటేనని కొత్త రాగం ఎత్తుకున్నడు. జనం తనకు ఎట్లా ఓట్లెయ్యరని వెంకయ్యనాయుడుతో కలిసి చక్రంతిప్పి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్త అని బీసీ కార్డు ఎరవేసిండు బాబు కుట్రను ఊహించిన తెలంగాణ జనం ఆ పార్టీ బండకేసికొట్టి ఉద్యమపార్టీ టీఆర్ఎస్ పట్టం గట్టిండ్రు.
అయితే తెలంగాణ వచ్చిన తరువాత కూడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యతిరేక కుట్రలు ఆపలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పేరుతో తెలంగాణకు అన్యాయం చేసే చర్యలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఉద్యమాన్ని బద్ నాం చేయడానికి అన్ని రకాల కుట్రలకు టీడీపీ పాల్పడుతోంది. టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద కొత్త రూపంలో దాడికి ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ రాకుండా చేసింది సీమాంధ్రలోని తెలుగుదేశం ప్రభుత్వం. దీంతో తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాడానికి టీటీడీపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఆ సంఖ్య ఇప్పుడు 600లకు చేరుకుందని, గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శాసనసభలో ఎర్రబెల్లి వగల ఏడ్పులు ఏడుస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు వేధిస్తుంటే ఒక్క మాట అడగలేని ఎర్రబెల్లి, ఆయన సహచర నేతలు తెలంగాణ రైతుల గురించి బాధపడడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సీమాంధ్రలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నుండి తెలంగాణకు చేటు కలగకుండా ఈ నేతలు అడ్డుకుంటే అదే వారు తెలంగాణకు చేసే మేలు.