టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇరుకునపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన భూములపై రేగిన దుమారం ఎంతవరకు వెళ్తుందో తెలియని పరిస్థితి. గ...
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇరుకునపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన భూములపై రేగిన దుమారం ఎంతవరకు వెళ్తుందో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వం నుంచి పరిశ్రమల పేరుతో పొన్నాల తక్కువ ధరకు భూములు తీసుకుని, అందులో పరిశ్రమలేవీ నెలకొల్పలేదని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆ భూముల్లో కోళ్ల పరిశ్రమ(ఫౌల్ట్రీ ఫామ్) మాత్రమే ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో పొన్నాల లక్ష్మయ్య భూములపై హరీష్ రావు చర్చించారు. తక్కువ ధరకు విక్రయించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పకుంటే తమకు అప్పగించాలని 2013లోల ఏపీఐఐసీ చెప్పిందని గుర్తుచేస్తూ పొన్నాల మాత్రం ఆ భూములను అప్పగించలేదని ఆరోపించారు. 2005లో 8.3 ఎకరాలను మార్కెట్ ధర కంటే పొన్నాలకు తక్కువ ధరకే సదరు పొన్నాలకు ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు. అదంతా అసైన్డ్ భూమని ఆయన చెప్పారు. కేవలం ఎకరా రూ. 25,500లకే విక్రయించారని హరీష్ చెప్పారు.
మరోవైపు పొన్నాల భూముల సహా తెలంగాణలో దళితుల భూములు ఎక్కడెక్కడ ఎలా అన్యాక్రాంతం అయ్యాయో విచారించడానికి శాసనసభ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పొన్నాల లక్ష్మయ్య భూముల వివాదం పై చర్చలో ఆయనా జోక్యం చేసుకున్నారు. దళితుల భూముల అన్యాక్రాంతం అయిన వ్యవహారాలపై సభా కమిటీని వేయడానికి సిద్దమని ఆయన ప్రకటించారు. అయితే జానారెడ్డి మాత్రం అది అసైన్డ్ భూమి కాదంటూ పొన్నాలను వెనకేసుకొచ్చారు. ఈ వాదనల మద్యే స్పీకర్ మదుసూదనాచారి సభా సంఘాన్ని వేస్తున్నట్లు ప్రకటించారు.
