”తెలంగాణ రాష్ట్రానికి సమస్యలు సృష్టించడమే మీ పనా? వేరే ఇంకే పనీ లేదా… మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. లేనిపోని కుట్రలు చేయొద్దు.. పార్లమెం...

”తెలంగాణ రాష్ట్రానికి సమస్యలు సృష్టించడమే మీ పనా? వేరే ఇంకే పనీ లేదా… మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. లేనిపోని కుట్రలు చేయొద్దు.. పార్లమెంటులో మీ సంగతి తేలుస్తాం” అని సీమాంధ్ర నాయకులపై టీఆరెఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క మాటయినా అడగాల్సిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ పని చేసుంటే బాగుండేదని ఆయన సూచించారు. ఇప్పుడు ఆ టెర్మినల్ కు ఎన్టీఆర్ పెట్టడంపై పార్లమెంటులోనూ తమ గళం వినిపిస్తామని.. అక్కడ చూసుకుందామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా సీమాంధ్ర నేతలకు వత్తాసు పలుకుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని టీడీపీ నాయకులు కూడా ఆంధ్ర ప్రాంత నాయకుల్లాగే వ్యవహరిస్తున్నారని… రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవాలని ఈ భువనగిరి ఎంపీ హితవు పలికారు.
శంషాబాద్ విమానాశ్రయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన టీఆరెస్ త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ అంశంపై తన గళం విప్పాలని నిర్ణయించింది. టీఆరెఎస్ ఎంపీలంతా ఈ విషయాన్ని దేశంలోని మిగతా పార్టీ దృష్టికి తీసుకెళ్లి సీమాంధ్ర నేతల కుట్రలు, వారికి బీజేపీ వంత పాడడం వంటివన్నీ వివరించాలనుకుంటున్నారు. మొత్తానికి అందరి మద్దతు కూడగట్టి కేంద్రం మెడలు వంచాలన్నదే టీఆరెఎస్ లక్ష్యమని తెలుస్తోంది