తెలంగాణలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచబోమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగావకాశాలు...
తెలంగాణలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచబోమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ఉందని, ఆందువల్లే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచకూడదని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వంపై యువతలో కొత్త ఆశలు ఏర్పడ్డాయి… వాటిని నెరవేర్చే బాధ్యత మాది.. అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అవుతుంది” అని ఈటెల చెప్పారు. అంతేకాదు, ఇప్పడున్న ఉద్యోగులకు రెండేళ్ల పదవీ విరమణ వయసు పెంచడం మంచిదే కావచ్చు.. కానీ, దానివల్ల ఉద్యోగాలు లేనివారికి ఉద్యోగాలు రావడంలో ఆలస్యమవుతుంది. యువత నిరాశ నిస్పృహలకు గురయ్యే ప్రమాదం ఉంది. కొత్తవారికి అవకాశం కల్పించడం అవసరం అని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచిన నేపధ్యంలో ఇక్కడా అలాంటిది అమలు చేస్తారేమో అని కొందరు భావించారు. కానీ ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారి కోసం నిరుద్యోగుల పొట్ట కొట్టరాదని టీఆరెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులు, నిరుద్యోగుల్లోనే కాదు అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. తమకు రెండేళ్లు పదవీ కాలం పెంచడం కంటే తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనుకోవడం మంచి నిర్ణయమని ఉద్యోగులూ అంటున్నారు.