ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో చలి గాలులు వీయడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడు రోజులుగా శీతల తీవ్రత విపరీతంగా పెరగడంతో గురువార...
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో చలి గాలులు వీయడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడు రోజులుగా శీతల తీవ్రత విపరీతంగా పెరగడంతో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఉదయం, సాయంత్రం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వృద్ధులు, చిన్నారులు, ఆస్తమ వ్యాధి గ్రస్తులపై తగ్గిన ఉష్ణోగ్రత తీవ్ర ప్రభావం చూపుతున్నది. మేఘాలు లేకపోవడంతో ఉత్తర దిశ నుంచి హిమాలయ పర్వతాల గుండా వీస్తున్న శీతల గాలుల వల్ల చలి తీవ్రత పెరిగిందని వాతావరణ, వ్యవసాయ పరిశోధన శాస్త్ర వేత్త డాక్టర్ దండుమోహన్దాస్ తెలిపారు. ఏడేండ్లుగా ఇటువంటి పరిస్థితి రాలేదని పలువురు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మరో రెండుమూడు రోజులపాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయన్నారు.
వృద్ధులు, చిన్నారులు తదితర వ్యాధి గ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నా రు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. కరీంనగర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 7.9 నమోదవగా, మెదక్ 8.5, నిజామాబాద్ 9, రంగారెడ్డి, 9.6, హైదరాబాద్, వరంగల్లో 11, నల్లగొండలో 14.6, మహబూబ్నగర్ 15.6, ఖమ్మంలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడంతో జనం వణికి పోతున్నారు.