హైదరాబాద్, డిసెంబర్ 18 (టీ మీడియా): లక్షల మంది నిరుద్యోగుల ఆకాంక్షల మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం కొలువుదీరింది. చైర్మన్గ...
హైదరాబాద్, డిసెంబర్ 18 (టీ మీడియా): లక్షల మంది నిరుద్యోగుల ఆకాంక్షల మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం కొలువుదీరింది. చైర్మన్‌గా ఘంటా చక్రపాణి ఉదయం 11:23 గంటలకు ప్రమాణం చేశారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. ఆయనతో ప్రమాణం చేయించారు.
-చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యుల ప్రమాణం
-భారీగా తరలివచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు
-త్వరలో లక్షా ఏడు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
-ప్రతిభకే పట్టం.. రాజకీయాలకు తావులేదు: చక్రపాణి
-నియామక నిబంధనలపై రెండు, మూడురోజుల్లో నిర్ణయం
-భారీగా తరలివచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు
-త్వరలో లక్షా ఏడు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
-ప్రతిభకే పట్టం.. రాజకీయాలకు తావులేదు: చక్రపాణి
-నియామక నిబంధనలపై రెండు, మూడురోజుల్లో నిర్ణయం
చక్రపాణితోపాటు కమిషన్ సభ్యులు విఠల్, చంద్రావతి కూడా ప్రమాణంచేశారు. ఉస్మానియాతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని యూనివర్సిటీల నుంచి తరలివచ్చిన వందల మంది విద్యార్థులతో ప్రమాణస్వీకారోత్సవం పండుగలా జరిగింది. ఎంతోమంది విద్యార్థులు త్యాగాల ప్రతిఫలంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తాము ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న, తమ ఉద్యోగ కలలను సాకారంచేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువుదీరడాన్ని ప్రత్యక్షంగా చూడటానికి ఉత్సాహం కనబరిచారు.
దీంతో టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర కోలాహలం నెలకొన్నది. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్, విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రమాణం తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కార్యాలయంలో చైర్మన్ చక్రపాణి సహా సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే లక్షా ఏడువేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీచేయడానికి కృషిచేస్తామని వెల్లడించారు. నాలుగునెలల్లో అన్ని పనులు పూర్తిచేస్తామని తెలిపారు.
విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రతిభకే పట్టంకడతామని, ఉద్యోగాల భర్తీలో రాజకీయాలకు ఆస్కారం ఉండబోదని హామీఇచ్చారు. ఎవరికి లొంగేవాడిని కాదు.. చివరికి ముఖ్యమంత్రి చెప్పినా వినేవాడు కాదు.. అందుకే ఈ పదవి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు అని ఈ సందర్భంగా చక్రపాణి అన్నారు. ఉద్యోగ నియామకాల్లో పైరవీలకు అవకాశం లేకుండా చేస్తామని స్పష్టంచేశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియమనిబంధనలు ఎలా ఉండాలో నిర్ణయిస్తామని.. పరీక్షల విధివిధానాలపై రెండు, మూడురోజుల్లో సభ్యులతో సమావేశం ఏర్పాటుచేసి చర్చిస్తామన్నారు.
ఆ తర్వాత పరీక్షల విధానం గురించి వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇకనుంచి రాజకీయ నాయకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, కేవలం నిరుద్యోగులు మాత్రమే రావాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు కూడా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొనేలా, హాల్‌టిక్కెట్లు అందుకొనేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఏపీ పబ్లిక్ సర్వీస్ కార్యాలయం నుంచి సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మోడల్‌గా నిలబెడుతామని, అందుకనుగుణంగానే కమిషన్ పని చేస్తుందన్నారు. మనం నిజాయతీగా లేకపోతే.. తెలంగాణ సమాజంలో కూడా నిజాయతీ రాదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, వారి ఆశలకు అనుగుణంగానే త్వరితగతిన నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చైర్మన్ హామీఇచ్చారు.
ఇక టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ప్రమాణంచేసిన విఠల్ మాట్లాడుతూ.. డబ్బులు ఇస్తేనో, పైరవీలు చేస్తేనో ఉద్యోగాలు వస్తాయన్న ఆరోపణలు ఏపీపీఎస్సీపై ఉన్నాయని, ఇకనుంచి అలాంటివాటికి చోటుందని స్పష్టంచేశారు. సర్వీస్ కమిషన్‌ను ఒక పవిత్రదేవాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతిభావంతులకే ఉద్యోగాలు వచ్చేలా తాము కృషిచేస్తామన్నారు.
చంద్రావతి మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటిస్తామని తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ.. విమర్శకుల నోళ్లు మూయించేలా టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. వీలైనంత త్వరలో కొత్త నోటిఫికేషన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేస్తున్నామని తెలిపారు.
ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ ఏర్పాటుచేసి నిరుద్యోగులలో ఆత్మవిశ్వాసం కలిగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీచేస్తామన్న సీఎం నిర్ణయం సాహసోపేతమని అన్నారు. టీఎస్పీఎస్సీ ఏర్పాటుతో నిరుద్యోగుల కష్టాలు తీరినట్లేనని ఇంటర్విద్యా జేఏసీ చైర్మన్ అభిప్రాయపడ్డారు. గ్రూప్-1 సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు సముచితస్థానం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పవన్‌గౌడ్, జనరల్ సెక్రెటరీ, సర్వీస్ కమిషన్ సెక్రెటరీ సుందర్‌అబ్నార్ తదితరులు పాల్గొన్నారు.
అమరవీరులకు నివాళులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రావతి.. గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలు హోరెత్తాయి.
ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్, ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, గ్రేటర్ జేఏసీ మైనారిటీ విభాగం చైర్మన్ మహ్మద్బద్రుద్దీన్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మజీబ్, నాలుగోతరగతి ఉద్యోగుల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహేందర్‌కుమార్ పాల్గొన్నారు.
ముగిసిన చాంబర్ల కేటాయింపు వివాదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, కార్యదర్శులకు చాంబర్ల కేటాయింపులో ఏపీపీఎస్సీ అధికారులు మొండికేశారు. తమ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే చాంబర్లు ఖాళీచేస్తామని పట్టుబట్టారు. అయితే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ అనుమతితో రెండో అంతస్థులో చాంబర్లను చైర్మన్, సభ్యులు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో చాంబర్లు కేటాయించే ప్రక్రియలో వివాదానికి గురువారం సాయంత్రంతో తెరపడింది.
2015 ఉద్యోగనామ సంవత్సరం
-నియామక క్యాలండర్ రూపొందిస్తాం
-నిజాయతీగా ఉద్యోగాల భర్తీ
-కోర్టు లిటిగేషన్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి
-నిజాయతీగా ఉద్యోగాల భర్తీ
-కోర్టు లిటిగేషన్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి
హైదరాబాద్, డిసెంబర్ 18 (టీ మీడియా): ఉద్యోగనామ సంవత్సరంగా 2015ను మారుస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన తర్వాత నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. చైర్మన్‌గా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..
ప్ర: టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్‌గా ఎలా ఫీలవుతున్నారు?
జవాబు: చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై గురుతరమైన బాధ్యత ఉంచారు. సీఎంతోపాటు నిరుద్యోగుల ఆశలు వమ్ముకానీయకుండా పనిచేస్తాను. లక్షా ఏడువేల ఉద్యోగాలు భర్తీచేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కమిషన్ పనిచేస్తుంది. ఆ మేరకు 2015ను ఉద్యోగనామ సంవత్సరంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తాం. రాష్ట్రం ఏర్పాటైంది ఉద్యోగాల కోసమే అన్నట్లుగా అందరూ భావిస్తున్నారు. విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే లక్షల ఉద్యోగాలు వస్తాయి. వాటిని న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా భర్తీచేయడమే లక్ష్యం.
ఏపీపీఎస్సీలో అన్యాయం జరిగిన తెలంగాణ విద్యార్థులకు ఎలా న్యాయం చేస్తారు?
ఆంధ్రా పాలకుల చేతుల్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగింది. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడి ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకే దక్కుతాయి. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక జరుగుతుంది. నిర్వహించే రాతపరీక్షలలో మెరిట్ సాధించినవారికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి.
రాతపరీక్షల సిలబస్ మారుతుందా? లేక ఏపీపీఎస్సీలో అమలుచేసే సిలబస్‌నే కొనసాగిస్తారా?
టీఎస్పీఎస్సీ రాతపరీక్షల్లో ఏపీ సిలబస్‌కు స్థానం ఉండదు. రాష్ర్టానికి సంబంధించిన అంశాలను మాత్రమే సిలబస్‌లో పొందుపరుస్తాం. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకొనే సివిల్ సర్వెంట్లు.. తెలంగాణ భాషలు, యాసలు, సంస్కృతులు, కవులు, కళాకారుల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీని ఎంపికచేసి.. వారి సలహాల మేరకు సిలబస్‌ను రూపొందిస్తాం. పోటీ పరీక్షల సిలబస్‌లో సమూల మార్పులు తీసుకువస్తాం. కొత్త నిబంధనలు, కొత్త విధానాలతో పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. దేశంలోనే టీఎస్పీఎస్సీని ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చు. ఆ మేరకు సర్వీస్ కమిషన్‌ను ఆధునీకరిస్తాం.
గతంలో గ్రూప్-1,గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. దీనిని ఎలా నివారిస్తారు?
ఏపీపీఎస్సీలో ఆంధ్రా పెత్తనం ఎక్కువగా ఉన్నది. ఉద్యోగ నియామకాలలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యేవి. దీనివల్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యేసరికి రెండు నుండు ఐదేండ్లు పట్టేది. దీనిని నివారించాలంటే రాజకీయాలకు చోటులేకుండా, పారదర్శకంగా ప్రతిభావంతులకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దీనికోసం యూపీఎస్సీ తరహాలో నియామక కేలండర్‌ను రూపొందిస్తాం. రాతపరీక్షలు, ఇంటర్వ్యూ, దరఖాస్తు చేసుకొనే తేదీలు ముందుగానే ప్రకటించి.. భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఏయే కేడర్‌లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో నిర్ధారణకు వచ్చిన తర్వాత వాటికి సంబంధించి ప్రత్యేక క్యాలండర్ రూపొందిస్తాం. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అనేక అక్రమాలు చోటుచేసుకోవడం వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్ల నిరుద్యోగుల్లో ఒకరకమైన అపవాదు నెలకొన్నది. టీఎస్పీఎస్సీలో ఆ పరిస్థితి రాకుండా చూస్తాం.
భర్తీ ప్రక్రియలో ఎలాంటి విధానాలు అనుసరిస్తారు?
శాస్త్రసాంకేతిక విధానాన్ని అందిపుచ్చుకుంటాం. ఆన్లైన్ విధానంలో ముందుకు సాగుతాం. నోటిఫికేషన్, దరఖాస్తు చేసుకోవడం, హాల్‌టిక్కెట్లు జారీచేయడంతోపాటు ఫలితాలు, పరీక్షలకు సంబంధించిన కీ వంటి అన్ని పనులను ఆన్లైన్లోనే నిర్వహిస్తాం. ఉద్యోగ ప్రకటనలతో నిమిత్తం లేకుండా.. నిరుద్యోగులు అర్హతను బట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. నిపుణులతో చర్చిస్తాం.
సిబ్బంది కేటాయింపు ఎంతవరకు వచ్చింది?
టీఎస్పీఎస్సీ ఏర్పాటైనా విభజన పూర్తికాలేదు. సర్వీస్ కమిషన్‌లో చైర్మన్, ముగ్గురు సభ్యులు, ఒక సెక్రటరీ మాత్రమే ఉన్నారు. రెండు రాష్ర్టాల ప్రధానకార్యదర్శులు ఈ అంశంపై చర్చించి, టీఎస్పీఎస్సీకి సిబ్బందిని కేటాయించే ప్రక్రియ వారంలో పూర్తిచేసే అవకాశం ఉన్నది.
నిరుద్యోగులకు మీరిచ్చే సందేశం..?
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. టీఎస్పీఎస్సీ నుంచి నిరంతరంగా ఉద్యోగాల భర్తీ జరుగుతూనే ఉంటుంది.