-ప్రాణం తీసే నూనె ! -దాడి చేసి.. స్థావరాన్ని ధ్వంసం చేసిన స్థానికులు -74 డబ్బాల నూనె స్వాధీనం పాతబస్తీలోని అరుంధతి కాలనీలో రహస్యంగా జంతు...
-ప్రాణం తీసే నూనె !
-దాడి చేసి.. స్థావరాన్ని ధ్వంసం చేసిన స్థానికులు
-74 డబ్బాల నూనె స్వాధీనం
-దాడి చేసి.. స్థావరాన్ని ధ్వంసం చేసిన స్థానికులు
-74 డబ్బాల నూనె స్వాధీనం
పాతబస్తీలోని అరుంధతి కాలనీలో రహస్యంగా జంతుకళేబరాల నుంచి నూనె తయారు చేస్తున్న కేంద్రంపై స్థానికులు దాడి చేశారు. నిర్వాహకులను పోలీసులకు అప్పగించారు. 74 డబ్బాల నూనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్‌కు చెందిన అహ్మద్(55), అబేద్ (50) నగర శివారు ప్రాంతాల నుంచి కళేబరాలు సేకరించి దందా సాగిస్తున్నారు. రూ.5కే పాతబస్తీ ప్రాంతంలో నూనె విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికుల చొరవతో వారి గుట్టు రట్టయింది. మాదన్నపేట్/చాంద్రాయణగుట్ట, (టీ మీడియా ): సంతోష్‌నగర్‌లో జంతు కళేబరాలతో నూనె తయారీ చేస్తున్న స్థావరంపై స్థానికులు దాడి చేసి నిర్వాహకులను పోలీసులకు అప్పగించారు. రహస్యంగా సాగుతున్న ఈ జంతు కళేబరాల నూనె కేంద్రంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కిలో రూ. 5కు విక్రయం
ఈ దాడిలో కేంద్రంలో భారీగా పేరుకుపోయిన కళేబరాలను, ఎముకలను గుర్తించారు. నూనెను తయారు చేసే బట్టీలను ధ్వంసం చేశారు. 74 డబ్బలల్లో నింపి, విక్రయించడానికి సిద్ధంగా ఉన్న నకిలీ నూనెను పట్టుకున్నారు. ఒక్కో డబ్బలో 75కేజీల నూనె ఉన్నట్లు విచారణలో తేలింది. ఒక్కో డబ్బను మార్కెట్లో 400రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంటే ఒక కిలో రూ. 5 పడుతుంది. నగరంలో సంతోష్‌నగర్, ఓల్డ్‌మలక్‌పేట, డబీర్‌పురా, చంద్రాయణ్గుట్టలతో పాటు శివారు ప్రాంతాలైన కాటేదాన్, తూర్కయాంజల్, ఉప్పల్, మేడ్చెల్ ప్రాంతాల్లో కెమికల్ వాసనలు వచ్చే ప్రాంతాల్లో వీటి తయారీ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. బయట మార్కెట్లో అసలైన నూనె కిలోకు రూ. 80 వరకు పలుకుతుండడంతో పాతబస్తీ పరిసర ప్రాంతాలలోని పలు హోటళ్లు జంతుకళేబరాలతో తయారు చేసిన నూనెలు సరఫరా అవుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
జంతు కళేబరాలతో తయారు చేసిన నూనె వాసన వస్తుంది. అసలైన నూనెలో కలిపి దీనిని వాడుతున్నారని భావిసున్నారు. తయారీ కేంద్రం వద్దకు వచ్చి పలువురు నూనె డబ్బాలు కొనుగోలు చేస్తున్నారని పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు వెల్లడించాడు. ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, తినుబండారాలు తయారు చేసే కేంద్రాలు, కొన్ని బిర్యానీ సెంటర్లకు ఈ తక్కువ ధర నూనె వెళ్తుందనే సమాచారం వస్తుందని పోలీసులు వెల్లడించారు. వీటితో పాటు కొన్ని సబ్బుల కేంద్రాలకు కూడా ఇది సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి నూనెలను కొనుగోలు చేసే వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సంతోష్‌నగర్ ఏసీపీ మహ్మద్ అశ్ఫాక్ టీమీడియాతో పేర్కొన్నారు. కొనుగోలు దారులు పట్టుబడితేనే నూనెలు ఎందుకు వాడుతున్నారనే విషయంలో స్పష్టత వస్తుందని వివరించారు.