-ఆ దిశగా మరో అడుగు ముందుకేసిన ఇస్రో.. -పదేండ్లలో కల సాకారం -జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగపరీక్ష సక్సెస్.. - రాకెట్తోపాటు నింగిలోకి దూసుకెళ...
-ఆ దిశగా మరో అడుగు ముందుకేసిన ఇస్రో..
-పదేండ్లలో కల సాకారం
-జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగపరీక్ష సక్సెస్..
- రాకెట్తోపాటు నింగిలోకి దూసుకెళ్లిన క్రూమా డ్యూల్
-విజయవంతంగా తిరిగి కిందికి..
-ఇస్రోకు రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ అభినందనలు
-పదేండ్లలో కల సాకారం
-జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగపరీక్ష సక్సెస్..
- రాకెట్తోపాటు నింగిలోకి దూసుకెళ్లిన క్రూమా డ్యూల్
-విజయవంతంగా తిరిగి కిందికి..
-ఇస్రోకు రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ అభినందనలు
శ్రీహరికోట, డిసెంబర్ 18: అంతరిక్షంలోకి భారత వ్యోమగామి.. ఇది ఎన్నో దశాబ్దాల కల. ఆ కలను సాకారంచేసే దిశగా ఇస్రో మరో అడుగు ముందుకేసింది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం నిర్వహించిన మానవరహిత క్రూమాడ్యూల్ (వ్యోమగాముల గది) ప్రయోగపరీక్ష విజయవంతమైంది. అత్యంత భారీరాకెట్ అయిన జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా క్రూమాడ్యూల్ను ఉదయం సరిగ్గా 9.30 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు.
భూమివైపు తిరిగొచ్చే క్రమంలో మాడ్యూల్.. 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలగడం గమనార్హం. ఈ ప్రయోగపరీక్ష విజయం సాధించడంతో మరో పదేండ్లలో భారత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే వీలు కలిగింది. దీనికితోడు భారీ ఉపగ్రహాలను మోసుకెళ్లగల జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగపరీక్ష కూడా విజయవంతమవడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇది ఇస్రో చరిత్రలో ఒక మరుపురాని రోజు అని చైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. రెండు దశల్లోనూ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగపరీక్ష విజయవంతమైందని ఆయన వెల్లడించారు. మరో అద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకొన్న ఇస్రోను రాష్ట్రపతి ప్రణబ్, ప్రధానమంత్రి మోదీ అభినందించారు. మూడు టన్నుల బరువు కలిగిన ఈ క్రూమాడ్యూల్ 2.7 మీటర్ల పొడువు, 3.1 మీటర్ల వ్యాసంతో ముగ్గురు వ్యోమగాములు కూర్చోడానికి వీలుగా ఉంది.
త్వరలోనే కల సాకారం
భారత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపాలన్న లక్ష్యంతో ఉన్న ఇస్రో.. ఆ దిశగా తొలిఅడుగు విజయవంతంగా వేసింది. క్రూమాడ్యూల్ పరీక్ష అనుకున్నట్లుగానే ముగియడంతో మన వ్యోమగామిని మరో పదేండ్లలోనే అంతరిక్షంలోకి పంపొచ్చని అంచనా వేస్తున్నారు. అంతరిక్షంలో వ్యోమగామిని నిలిపేస్థాయికి క్రూమాడ్యూల్ను పంపడానికి మరో ఏడేండ్లు పడుతుందని ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో దిగిన క్రూమాడ్యూల్ను సేకరించి తిరువనంతపురంలోని విక్రమ్‌సారాభాయ్ స్పేస్‌సెంటర్‌లో దానిపై మరింత అధ్యయనం చేయనున్నారు.
పదేండ్ల శ్రమకు ఇది ప్రతిఫలమని ప్రయోగాన్ని దగ్గరుండి వీక్షించిన ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ అన్నారు. ఇక గతంలో తేలికైన ఉపగ్రహాలను మోసుకెళ్లగలిగే రాకెట్లను తయారుచేసిన ఇస్రో.. భారీ ఉపగ్రహాల ప్రయోగానికి మాత్రం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే తాజాగా జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగపరీక్ష విజయవంతం కావడంతో ఇకనుంచి భారీ ఉపగ్రహాలను కూడా సొంతంగానే ప్రయోగించే వీలు కలిగింది. 630 టన్నుల బరువున్న జీఎస్ఎల్వీ మార్క్-3.. నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టగలదు.
మేం అనుకున్నది సాధించగలిగాం. భారీ ఉపగ్రహాలను ప్రయోగించే దిశగా తొలి అడుగువేశాం. ఈ ప్రయోగపరీక్ష విజయవంతం కావడం వల్ల ఇస్రో సామర్థ్యం పెరిగింది. క్రయోజనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మరో రెండేండ్లలో అది పూర్తవుతుంది అని జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ సోమనాథ్ వెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్-3పై పూర్తిపట్టు సాధించగలిగితే ఇకనుంచి భారీ ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించే వీలు కలుగుతుంది.
ఇన్నాళ్లూ దీనికోసం విదేశాలపై ఆధారపడిన భారత్‌కు భారీఎత్తున విదేశీ మారకనిల్వలు కూడా మిగులుతాయి. అంతేకాదు ఇతర దేశాల భారీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా పెద్దమొత్తంలో విదేశీమారకం భారత్ ఖాతాలోకి చేరుతుంది. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ కోసం ఇస్రో రూ.140 కోట్లు ఖర్చు చేయగా.. మరో 15 కోట్లు క్రూమాడ్యూల్ (వ్యోమగాముల గది)కి ఖర్చయ్యాయి. గతేడాది అరుణగ్రహంపైకి అతితక్కువ ఖర్చుతో పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతమైనప్పటి నుంచి ఉత్సాహంగా ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు వరుస విజయాలు సాధిస్తున్నారు.
మరో రెండేండ్లలో మార్క్-3 క్రయోజనిక్ ఇంజిన్
భారీ ఉపగ్రహాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న జీఎస్ఎల్వీ మార్క్-3 కోసం క్రయోజనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, మరో రెండేండ్లలో అది పూర్తవుతుందని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు. తమిళనాడులోని మహేంద్రగిరి లిక్విడ్ ప్రాపల్షన్ సిస్టమ్స్ సెంటర్లో ఈ ఇంజిన్ తయారవుతున్నదని తెలిపారు. ఇక వచ్చే ఏడాది మార్చిలో మరో ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్స్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్) ఉపగ్రహాన్ని పంపనున్నట్లు చెప్పారు. ఇప్పటికే మూడు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా సొంతంగా నావిగేషన్ వ్యవస్థ ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరనున్నది.
రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ అభినందనలు
గగనతలంలో మరో కీర్తిపతాకను ఎగురేసిన ఇస్రో శాస్త్రవేత్తలపై అభినందనల వర్షం కురుస్తున్నది. ఇస్రో శాస్త్రవేత్తల తెలివితేటలు, కష్టపడి పనిచేసే తత్వానికి మరో విజయం దాసోహమైంది. వాళ్ల కృషికి నా అభినందనలు అని మోదీ ట్వీట్‌చేశారు.
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని అతి ముఖ్యమైన మైలురాయిగా ఆయన అభివర్ణించారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సామర్థ్యం క్రమంగా పెరుగుతున్నదనడానికి ఇది నిదర్శనమని ఇస్రో చైర్మన్ రాధకృష్ణన్‌కు పంపిన సందేశంలో ప్రణబ్ కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అటు లోక్‌సభ కూడా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించింది. ఈ ప్రయోగం విజయవంతమవడం ద్వారా అత్యంత క్లిష్టమైన ప్రయోగాలు చేసే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది. ఇస్రో శాస్త్రవేత్తల విజయాలు చూసి మేం గర్విస్తున్నాం అని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే క్రమంలో అతిముఖ్యమైన మైలురాయిని అందుకొన్న శాస్త్రవేత్తలను అభినందిస్తున్నట్లు తెలిపారు.