-గాంధీ దవాఖానలో రెండు రోజుల్లో ముగ్గురు మృతి -ఇద్దరు నగర వాసులు, మరొకరు మెదక్‌వాసి హైదరాబాద్ సిటీబ్యూరో/ సిద్దిపేట, (టీ మీడియా): రాష్ట్ర...
-గాంధీ దవాఖానలో రెండు రోజుల్లో ముగ్గురు మృతి
-ఇద్దరు నగర వాసులు, మరొకరు మెదక్‌వాసి
-ఇద్దరు నగర వాసులు, మరొకరు మెదక్‌వాసి
హైదరాబాద్ సిటీబ్యూరో/ సిద్దిపేట, (టీ మీడియా): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్వైన్ ప్లూ బారిన పడి రెండు రోజుల్లో ముగ్గురు మరణించారు. వీరిలో కవిత (25), దేవరాజు (45) బుధవారం ఉదయం, ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (40) మంగళవారం మృతి చెందినట్లు గాంధీ దవాఖాన నోడల్ అధికారి నర్సింహులు తెలిపారు. వీరు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కూడా సాధారణ వైద్యచికిత్స తీసుకోవడంతోనే వ్యాధి తీవ్రత పెరిగిందన్నారు. పరిస్థితి విషమించిన తర్వాత దవాఖానకు తీసుకువచ్చారని, ఆలస్యంగా రావడంతోనే వారిని కాపాడలేకపోయామని తెలిపారు. దవాఖానలో చేరగానే రక్త పరీక్షలు నిర్వహించామని, పాజిటివ్ రిపోర్ట్ రావడంతోనే చికిత్స ప్రారంభించామని.. కానీ వ్యాధి తీవ్ర దశకు చేరడంతో ఫలితం లేకపోయిందన్నారు.
15 రకాల వైరస్‌తో స్వైన్ ప్లూ : రాష్ట్రంలో స్వైన్ ప్లూ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. స్వైన్ ఫ్లూతోపాటు మరో 15 రకాల వైరస్లు వాతావరణంలో స్వైరవిహారం చేస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. స్వైన్ ఫ్లూ వైరస్ అంత త్వరగా ఇతరులకు సోకే ఆవకాశం లేదని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నప్పటికీ... వైరస్ తీవ్రత, దాని పర్యావసానాలను బట్టి భవిష్యత్తులో ప్రజారోగ్యానికి ఇది పెద్ద సవాల్‌గా మారుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా జూన్-అక్టోబర్ మధ్య విస్తరించే ఈ వైరస్ నవంబర్‌లో వ్యాపించడం చాలా అరుదు. వ్యాధి బారిన పడిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాల్లోకి ప్రవేశించిన వైరస్.. సాధారణంగా రెండు నుంచి మూడు గంటలు మాత్రమే జీవిస్తుంది. ప్రస్తుతం చలికాలం అందులోనూ రాత్రి సమయంలో చల్లని గాలులు వీస్తుండటమే వైరస్ వ్యాప్తికి కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధికి నగరంలోని మల్టీ స్పెషాలిటీ దవాఖానలతోపాటు గాంధీ దవాఖానలో మాత్రమే వైద్య సేవలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కాగా, కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వ్యాధిబారి నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంటున్నారు. తరుచూ చేతులు శుభ్రం చేసుకోవడంతోపాటు వీలైనంత ఎక్కువసార్లు నీళ్లు తాగాలని చెప్తున్నారు.