న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారత్‌ను టార్గెట్ చేసినట్లు విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. జనవరి 26న ఢిల్...
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారత్‌ను టార్గెట్ చేసినట్లు విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతిథిగా వస్తున్న తరుణంలో లష్కరే ఉగ్రవాదులు దాడులకు పన్నాగం వేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఇటీవల మధ్యప్రదేశ్ జైలు నుంచి పరారైన ఐదుగురు అనుమానితులపై ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రత్యేక నిఘా పెట్టాయి. పరారైన అనుమానితులు పాక్‌లోని లష్కరే ఉగ్రవాదులతో ఫొన్లో మాట్లాడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు నిషేధిత సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) సంస్థ సభ్యలుగా భావిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడులకు పాల్పడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
స్కూళ్లు, కాలేజీలకు భద్రత:
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో తాలిబన్లు సృష్టించిన మారణహోమంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రజా ప్రాంగణాలు, మాల్స్, స్కూళ్ల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. పెషావర్ ఘటన నేపథ్యంలో అన్ని రాష్ర్టాలకు భద్రత పెంచాలని మార్గదర్శకాలను జారీ చేసినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ పరారైన సిమి ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని వస్తున్న హెచ్చరికలపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
స్కూళ్ల అంశంపై కేంద్ర మంత్రి పూర్తి వివరాలు వెల్లడించకపోయినా.. హోంశాఖ మాత్రం అన్ని రాష్ర్టాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. ఒకవేళ ఏదైనా ఆకస్మిక దాడి జరిగితే పిల్లలు సురక్షితంగా తప్పించుకునే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని హోంశాఖ స్కూళ్లకు సూచించింది. ముంబై దాడుల అనంతరం 2010లో స్కూళ్లకు, ప్రముఖ విద్యాసంస్థలకు జారీ చేసిన సలహాలను మళ్లీ అన్ని రాష్ర్టాలకు పంపనున్నట్లు హోంశాఖ అధికారి స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబై నగరాల్లోని టాప్ స్కూళ్లకు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రత్యేక భద్రతా సూత్రాలను సూచించనున్నారు.
రాష్ట్రంలో హై అలర్ట్:
కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. మెట్రోనగరాల్లో దాడులు జరుగొచ్చన్న హెచ్చరికలతో శంషాబాద్ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, రద్దీప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు.