-జిల్లాలో వరుస చోరీలు -బ్యాంకుల దోపిడీకి యత్నాలు -పోలీసులకు సవాల్‌గా ముఠాలు -భయాందోళనలో ప్రజలు జిల్లాలో దొంగలు చెలరేగుతున్నారు. రాత్రీ, ...
-జిల్లాలో వరుస చోరీలు
-బ్యాంకుల దోపిడీకి యత్నాలు
-పోలీసులకు సవాల్‌గా ముఠాలు
-భయాందోళనలో ప్రజలు
జిల్లాలో దొంగలు చెలరేగుతున్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా విజృంభిస్తున్నారు. ఒంటరిగా కనిపించిన మహిళల ఒంటిపై ఉన్న నగలు తస్కరిస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, పక్కగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 4న నిర్మల్ పట్టణంలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం చేశారు. అదే రోజు నిర్మల్ పట్టణంలోనే ఓ వ్యాపారి నుంచి రూ. 74, 200లున్న బ్యాగ్‌ను తస్కరించి అనూహ్యంగా స్థానికులు చేతికి చిక్కారు. ఇదే రోజు దండెపల్లి మండల కేంద్రంలో జరిగిన చోరీలో 17 తులాల బంగారంతోపాటు రూ. 4.50 లక్షల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లను కూడా వదలని దొంగలు ఈ నెల 5న కోటపల్లి మండలం మల్లంపేట, బజార్హత్నూర్ మండల కేంద్రంతోపాటు ఇదే మండలంలోని కొల్హారీలో మూడు విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లలో ఉండే రాగి వైరు ఎత్తుకెళ్లారు. -బ్యాంకుల దోపిడీకి యత్నాలు
-పోలీసులకు సవాల్‌గా ముఠాలు
-భయాందోళనలో ప్రజలు
ఈ నెల 8న మంచిర్యాల పట్టణంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో నిర్మల్ తరహాలోనే దోపిడీకి విఫల యత్నం చేశారు. ఇదే రోజు రాత్రి ఖానాపూర్‌లో తాళం వేసి ఉన్న రెండిళ్లలో చొరబడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ నెల 10 కాజిపేటలో బహిర్భూమికి వెళ్లి వస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు. ఇదే రోజు నిర్మల్ పట్టణంలో ఓ ఇంట్లో దూరిన దుండగుడు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడు. ఇతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 20న మంచిర్యాల పట్టణంలోని పలు ఫైనాన్స్‌లు, దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు దోపిడికి పాల్పడ్డారు. ఇలా వరుసగా జరుగుతున్న దొంగతనాలతో జనం బెంబేలెత్తి పోతున్నారు. అయితే గత నెలతో పోల్చుకుంటే ఈ నెలల దొంగ తనాలు తగ్గాయని పోలీసులు చెబుతున్నారు.
పారని ప్రత్యేక చర్యలు..
దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట చోరులు ప్రతాపం చూపుతూనే ఉన్నారు. ఎస్పీ తరుణ్‌జోషీ పోలీసులకు మూడంచెల విధులు కేటాయించి గస్తీ ముమ్మరం చేయించారు. అన్ని ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారులపై పోలీసుల గస్తీ పెరిగింది. పలు చోరీలతో సంబంధాలున్న కొందరు దొంగలను పట్టుకున్నా దోపిడీలు ఆగడం లేదు. బ్యాంకులకు యాజమాన్యాలే రక్షణ కల్పించుకోవాలని పోలీసులు సమావేశాలు నిర్వహించి మరీ చెబుతున్నారు. బ్యాంకుల్లో, ఏటీఎంల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పగలు సెక్యూరిటీ గార్డులను, రాత్రి వాచ్మెన్లను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు బ్యాంకర్లను కోరుతున్నారు. అయినా కొన్ని బ్యాంకుల్లో ఈ ఏర్పాట్లు ఉన్నట్లు కనిపించడం లేదు. గతంలో పోలీసులు ప్రజలచే గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు అవిపుడు పనిచేయడం లేదు.
గ్రామాల్లో గస్తీ బృందాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అలాగే గ్రామ పోలీసు వ్యవస్థను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటేనే దొంగతనాలను నివారించే అవకాశముంది. జిల్లాకు మూడు దిక్కుల్లో మహారాష్ట్ర రాష్ట్ర ఉంది. కొన్ని దోపిడీ ముఠాలు ఇక్కడి నుంచి వచ్చి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అంతరజిల్లా దొంగల ముఠాలు కూడా జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగతనాలు అరికట్టేందుకు ఎస్పీ తరుణ్‌జోషి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. అయినా ఏ రాత్రి ఏ మూలన దొంగ తనాలు జరుగుతాయో తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొన్నది.