హైదరాబాద్, డిసెంబర్ 23 (టీ మీడియా):కాంగ్రెస్ కురవృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాం...
హైదరాబాద్, డిసెంబర్ 23 (టీ మీడియా):కాంగ్రెస్ కురవృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో పంజాగుట్ట శ్మశానవాటికలో పూర్తయ్యాయి. కాకా పెద్ద కుమారుడు వినోద్ కాకా చితికి నిప్పంటించారు. అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన రాజకీయ, ప్రజా సంఘాల ప్రముఖులు, అభిమానులు కాకాకు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమాజిగూడలోని కాకా చిన్న కుమారుడు వినోద్ ఇంటి నుంచి కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్, అటునుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు సాగిన అంతిమయాత్రలో వందలమంది అభిమానులు పాల్గొన్నారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ నేత దిగ్విజయ్‌సింగ్ తదితర ప్రముఖులు కాకా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
-ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
-పంజాగుట్ట శ్మశానవాటికకు తరలివచ్చిన అభిమానులు
-హాజరైన రాహుల్ గాంధీ, దిగ్విజయ్, కుంతియా
-కాకాకు సీఎం కేసీఆర్, ఏపీ సీఎం బాబు తదితరుల శ్రద్ధాంజలి
-కడసారి చూపుకోసం తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు
-పంజాగుట్ట శ్మశానవాటికకు తరలివచ్చిన అభిమానులు
-హాజరైన రాహుల్ గాంధీ, దిగ్విజయ్, కుంతియా
-కాకాకు సీఎం కేసీఆర్, ఏపీ సీఎం బాబు తదితరుల శ్రద్ధాంజలి
-కడసారి చూపుకోసం తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు
అంతకుముందు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ, ఏపీ శాసన మండళ్ల చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రెండు రాష్ర్టాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
కాకా చివరి చూపుకోసం ప్రజా, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతిమయాత్ర పొడవునా కాకా అమర్ రహే అనే నినాదాలు మిన్నంటాయి. మధ్యాహ్నం 2 గంటలకు కాకా అంత్యక్రియలు పూర్తికావాల్సి ఉండగా, దాదాపు మూడు గంటలు ఆలస్యంగా సాయంత్రం 4:30 గంటల సమయంలో పూర్తయ్యాయి. రాహుల్‌గాంధీ రావటం ఆలస్యం కావడంతో కాకా అంత్యక్రియలు ఆలస్యమయ్యాయి.
ప్రముఖుల శ్రద్ధాంజలి
మూత్రపిండాల వ్యాధితో సోమవారం రాత్రి కన్నుమూసిన కాకా భౌతికకాయాన్ని రాజ్‌భవన్‌రోడ్డులోని కాకా చిన్న కుమారుడు వివేక్ నివాసానికి తరలించారు. దీంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాకా భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులతో కలిసి మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో వివేక్ నివాసానికి చేరుకుని కాకా భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.
కాకా కుమారులు వివేక్, వినోద్, అల్లుడు శంకర్రావు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకుడు కే కేశవరావులతో కలిసి కేసీఆర్ దాదాపు 10 నిమిషాలపాటు అక్కడే ఉన్నారు. అంతకు ముందే ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వివేక్ ఇంటికి చేరుకొని కాకా భౌతిక కాయానికి నివాళులర్పించారు. మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు కొప్పుల రాజు, ఆర్సీ కుంతియా, జానారెడ్డి,
డీ శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, బాల్క సుమన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీడీపీ నేతలు టీ దేవేందర్‌గౌడ్, ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, విజయరామరావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, జే గీతారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, దివాకర్‌రావు, రసమయి బాలకిషన్, ఆర్ కృష్ణయ్య,
ఎమ్మెల్సీలు వెంకట్రావు, నన్నపునేని రాజకుమారి, సుధాకర్‌రెడ్డి, మహ్మద్ జానీ, పాలడుగు వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రులు ఎస్ జైపాల్‌రెడ్డి, చిరంజీవి, పనబాక లక్ష్మి, బలరాంనాయక్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, అంజన్‌కుమార్‌యాదవ్, మందా జగన్నాథం, రాష్ట్ర మాజీ మంత్రులు డీ శ్రీధర్‌బాబు, పురుషోత్తంరావు, బస్వరాజు సారయ్య, నాగం జనార్దన్‌రెడ్డి, పినిపే విశ్వరూప్, దానం నాగేందర్, గడ్డం ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, అనిల్, యెండల లక్ష్మినారాయణ, డీ సుధీర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి,
గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులు అరుణా బహుగుణ, సయ్యద్ అన్వరుల్ హుదా, సినీ నిర్మాత డీ సురేష్‌బాబు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు, పలు ప్రజా సంఘాల నాయకులు కాకా భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి తన ఆప్తమిత్రుడైన కాకా భౌతిక కాయాన్ని సందర్శించి బోరున విలపించారు.
అశ్రునయనాలతో అంతిమయాత్ర
కాకా అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సోమాజీగూడలోని వివేక్ ఇంటినుంచి ప్రారంభమైంది. కాకా పార్దివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం గాంధీభవన్‌కు తరలించారు. యాత్ర రాజ్‌భవన్, నాంపల్లి మీదుగా మధ్యాహ్నం 3.20 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుంది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, మాజీమంత్రి సునీతా లకా్ష్మరెడ్డి తదితరులు భౌతిక కాయంపై పార్టీ పతాకాన్ని కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. కాకా మృ తికి సంతాప సూచకంగా పార్టీపతాకాన్ని అవనతం చేశారు. వాహనాన్ని గాంధీ భవన్ వద్ద కేవలం ఐదు నిమిషాలు ఉంచారు.
అక్కడి నుంచి అంతిమయాత్ర సాయంత్రం 4.10 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పెద్ద కుమారుడు వినోద్ చితికి నిప్పంటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సాయంత్రం 4:28 గంటలకు నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకున్నారు. కాకా భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అక్కడే ఉన్నారు.
కాకా సేవలు మరువలేనివి
పేదల సంక్షేమమే జీవితాశయంగా కాకా పనిచేశారు. ఇండ్లులేని నిరుపేదలకు గుడిసెలు నిర్మించి గుడిసెల వెంకటస్వామిగా కీర్తిగడించారు. తెలంగాణ బిడ్డ వెంకటస్వామి కలలు, ఆశయాలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- ఈటల రాజేందర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి
నిరుపేదలకు సొంత ఇండ్లు కావాలని పోరాడి నీడ కల్పించిన గొప్ప నాయకుడు కాకా. పేదవాళ్ల గుండెల్ల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి కాకా. జాతీయ, రాష్ట్రస్థాయిలో కార్మిక, పేద, బడుగువర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ, ఆ దిశగా లక్ష్యాలను సాధించిన నాయకుడు మనల్ని శాశ్వతంగా వదిలిపెట్టి పోవడం బాధాకరం.
- నాయిని నర్సింహ్మారెడ్డి, రాష్ట్ర హోం మంత్రి
కాకా మరణంతో తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశంలో ఒక రాజకీయ ధృవతార రాలిపోయింది. సుదీర్ఘకాలంపాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కాకా రాష్ట్ర, దేశ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి.
- స్వామిగౌడ్, శాసనమండలి చైర్మన్
రాజకీయాల్లో స్వాతంత్య్రం నాటి ఆఖరి దిగ్గజం కాకా. నేటి రాజకీయ నాయకులందరికీ ఆయన భీష్మపితామహుడిలాంటివారు. కాకా లేని నోటు కాంగ్రెస్‌కు తీర్చలేనిది.
-ఎస్ జైపాల్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి
కాకా అనేక మంది రాజకీయ నేతలకు స్ఫూర్తిగా నిలిచారు. ఎంతో మందికి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించారు. బడుగు, బలహీన వర్గాలు, కార్మిక లోకం కోసం కాకా పనిచేసి పేదల గుండెల్లో నిలిచిపోయారు.
- జానారెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత
కాకా మృతితో తెలంగాణ రాష్ట్రం గొప్ప తెలంగాణవాదిని, రాజకీయ నాయకుడ్ని కోల్పోయింది. కాకా మరణం రాష్ట్రానికి తీరని లోటు.
-పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ అధ్యక్షుడు
సమాజంలో మార్పుకు కాకా తనదైన రీతిలో శ్రమించారు. తెలంగాణ సాధన కోసం పోలీసు తూటాలు ఎదుర్కొన్న ప్రజాప్రతినిధి కాకా.
- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కాకా మరణంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. సమాజానికి సంబంధించి బడుగు, బలహీనవర్గాలకు కాకా మరణం తీరని లోటు.
- చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి
దళిత వర్గాలకు కాకా చేసిన సేవలు మరువలేనివి. జీవితకాలం మొత్తం బడుగు, బలహీన వర్గాల సేవలకే ఆయన అంకితమయ్యారు.
-బాల్క సుమన్, టీఆర్ఎస్ ఎంపీ
కాకా మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు. తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర కీలకం.
-షబ్బీర్ అలీ, మాజీ మంత్రి
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నాయకుడు కాకా. తెలంగాణ సమాజం గొప్ప నేతను కోల్పోయింది. దళిత, బడుగు, బలహీనవర్గాల బాంధవుడైన కాకా జ్ఞాపకార్థం స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
- లక్ష్మణ్, బీజేపీ శాసనసభా పక్ష నేత
విద్యార్థి దశలో జరిగిన సేఫ్‌గార్డ్ ఉద్యమంలో కాకా పరిచయమయ్యారు. మా ఉద్యమానికి కాకా అండగా నిలిచారు. ఆయన స్మారకాన్ని నిర్మించేందుకు కృషి జరుగాలి.
-నాగం జనార్ధన్‌రెడ్డి, బీజేపీ నేత
నాటి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారు. కాకా మరణం తెలంగాణకు, దేశానికి తీరని లోటు.
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
కార్మికుల, బడుగువర్గాల నేతగా కాకా సేవలు వెలకట్టలేనివి. ఆయన లేని లోటు తెలంగాణకు తీరనిది.
- ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ చైర్మన్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన సేవలు మరిచిపోలేవి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిర్బంధాల మధ్య జర్నలిస్టులకు బాసటగా నిలిచారు.
- అల్లం నారాయణ, ప్రెస్ అకాడమీ చైర్మన్
వెంకటస్వామి మరణంతో తెలంగాణ సమాజం చాలా గొప్ప నాయకుడ్ని కోల్పోయింది. కాకా ఇంకొంత కాలం బతికి ఉంటే తెలంగాణకు మరింత మేలు జరిగేది.
- ప్రొఫెసర్ కోదండరాం, టీజేఏసీ చైర్మన్
పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన కాక బడుగుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.
- ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే