-నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పీజే శర్మ గుండెపోటుతో మృతి -శనివారమే మనవడు ఆది వివాహం -విషాదంలో కుటుంబసభ్యులు మణికొండ/అమీర్‌పేట్ (హ...
-నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పీజే శర్మ గుండెపోటుతో మృతి
-శనివారమే మనవడు ఆది వివాహం
-విషాదంలో కుటుంబసభ్యులు
మణికొండ/అమీర్‌పేట్ (హైదరాబాద్) : ప్రముఖ సినీనటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పీజే శర్మ (81) ఆదివారం హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవలే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మనవడు ఆది వివాహం శనివారం ఉదయం జరిగింది. ఈ వేడుకకు హాజరైన పీజేశర్మ ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు మృతిచెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మరణవార్త తెలియగానే మణికొండలోని పంచవటి కాలనీలోని నివాసానికి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు చేరుకుని నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
డబ్బింగ్ ఆర్టిస్టుగా,నటుడిగా ఎనలేని సేవలందించిన పీజే శర్మ మృతి చిత్ర రంగానికి తీరని లోటని పలువురు అన్నారు. ఆయన అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశానవాటికలో సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. అంత్యక్రియల్లో నటులు రాళ్ళపల్లి, వైజాగ్ ప్రసాద్‌తోపాటు పలువురు సాంకేతిక విభాగ నిపుణులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. పీజే శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వర శర్మ. పీజే శర్మ 1933 మే 24వ తేదీన విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య కృష్ణజ్యోతితోపాటు ముగ్గురు కుమారులు సాయికుమార్, రవిశంకర్, ఆయ్యప్పశర్మ, ఇద్దరు కూతుళ్లు కమల, ప్రియ ఉన్నారు.
1957లో ఇల్లరికం చిత్రంతో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన పీజేశర్మ తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో సుమారు 500 పైగా సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా తనదైన ముద్రను వేసుకున్నారు. నటుడిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎక్కువగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్న ఆయన తమిళనాడు మాజీ సీఎం యంజీ రామచంద్రన్, శివాజీగణేషన్ లాంటి ప్రముఖ నటులకు డబ్బింగ్ చెప్పారు. తండ్రి అడుగుజాడల్లోనే ఆయన తనయులు సాయికుమార్, రవిశంకర్ నటులు, డబ్బింగ్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకోగా మరో కుమారుడు అయ్యప్ప పీ శర్మ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
అలుముకున్న విషాదం
ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చిన బంధువులు ఇంకా వెళ్లనే లేదు. అర్ధరాత్రి దాకా గచ్చిబౌలిలో జరిగిన కుమారుడి రిసెప్షన్ వేడుకలలో పాల్గొని విశ్రాంతి తీసుకుంటున్న సాయికుమార్, కుటుంబసభ్యులకు పీజే శర్మ మృతి పెద్ద షాక్‌ను మిగిల్చింది. ఒక్కసారిగా చోటుచేసుకున్న విషాదాన్ని దిగమింగుకోలేని సాయికుమార్ రోదనలకు అంతులేకుండా పోయింది. పెండ్లికి వచ్చిన బంధువులతో కళకళలాడుతున్న ఇంట్లో జరిగిన విషాదం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.
శనివారం రాత్రిదాకా టీవీలో వచ్చిన ఆది పెండ్లి వేడుకలను ప్రత్యక్షప్రసారం ద్వారా చూసిన ప్రజలు కూడా పీజే శర్మ మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెళ్లి రిసెప్షన్‌లోనూ సాయికుమార్ పలుమార్లు తన తండ్రి గురించి చెప్తూ తమకు ఆయన ఇచ్చిన కంఠంతోనే ఇంతమందికి ఆదరణ లభిస్తున్నదని పలుమార్లు ఆయన గుర్తు చేశారు.