వరంగల్, : సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించి వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరమైన వరంగల్‌కు భారీగా న...
వరంగల్, : సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించి వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరమైన వరంగల్‌కు భారీగా నిధులు కేటాయించారు. ఎవరు ఊహించని విధంగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నాలుగు రోజులు 71గంటలు గడిపారు. వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.800 కోట్ల నిధులు కేటాయించారు. ప్రతిపక్షాలు ఆశ్చర్యపడేలా జిల్లాలో ఉన్న నాలుగు రోజులు ఏ ఒక్క నిమిషం వృథా చేయకుండా ప్రజాసంక్షేమం కోసమే సమీక్షలు నిర్వహించారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అందుకనుగుణంగా పనుల వేగవంతం చేశారు.
ప్రధానంగా స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టిసారించిన ఆయన పక్కా గృహాలు, పెన్షన్లు అందజేసేవరకు ఇక్కడి నుంచి వెల్లనని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట మేరకు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. మురికివాడల్లో నివసిస్తున్న వారికి పక్కా గృహాల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. జిల్లాకు వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్ మురికివాడల్లో జీప్లస్ వన్ పద్ధతిలో పక్కా గృహాల నిర్మాణానికి రూ.400 కోట్లు కేటాయించారు. భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధికి సుమారు రూ.400 కోట్లు కేటాయించారు.
గతం కంటే భిన్నంగా...!
గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సీఎం కేసీఆర్ ఓరుగల్లు నగరంపై చారిత్రాత్మక ముద్ర వేసారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారంటే రెండు, మూడు గంటలు మాత్రమే ఉం డి వెళ్తారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ ఊహలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ నాలుగు రోజులపాటు జిల్లాలో పర్యటించి రికార్డు సృష్టించారు. పార్టీ, ప్రజాప్రతినిధుల విషయాలను పక్కనబెట్టి కేవలం ప్రజల కోసమే నాలుగు రోజులు వెచ్చించారు. నిరుపేదల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ తక్షణ పరిష్కారమార్గాలు చూపారు. సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు తలెత్తుతే నేరుగా తనకు ఫోన్ చేయాలని నెంబర్‌ను సైతం ఇచ్చారు.
ఈ ప్రకటన ప్రజాప్రతినిధులు, అధికారులకు అల్టిమేటం ఇచ్చినైట్లెంది. మీ కష్టాలు తీర్చని క్రమంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని ప్రజల సమక్షంలోనే వెల్లడించారు. గురువారం సాయంత్రం 4.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకున్న కేసీఆర్ ఆదివారం 4.15 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
రోజువారీగా సీఎం పర్యటన..
డేవన్..మొదటి రోజు సీఎం కేసీఆర్ నగరంలోని లక్ష్మీపురం, శాకరాసికుంటలోని మురికి వాడల్లో పర్యటించారు. రాత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
డే టూ..రెండో రోజు సీఎం కేసీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీన్‌దయాల్‌నగర్, ప్రగతినగర్, అంబేద్కర్‌నగర్, జితెందర్నగర్లోని మురికివాడల్లో పర్యటించారు. తరువాత బ్రాహ్మణ సమాఖ్య సదస్సులో పాల్గొన్నారు. అక్కడి నుంచి భూపాలపల్లి చేరుకొని నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష చేశారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డే త్రి...మూడో రోజు సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో మూడు గంటల పాటు ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ఆ తదుపరి సాయంత్రం వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాలలోని మురికి వాడల్లో పర్యటించారు. అక్కడి నుంచి నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.
డే ఫోర్..నాల్గో రోజు సీఎం కేసీఆర్ సతీమణితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత నగరంలోని మురికి వాడల్లోని పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. పక్కా గృహాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. తిరిగి సాయంత్రం మూడున్నర గంటలకు కెప్టెన్ ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
