ఆదిలాబాద్ : తెలంగాణలోనే ఏకైక కాగితపు పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్పత్తి పునరుద్ధరణ విషయమై సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశం...
ఆదిలాబాద్ : తెలంగాణలోనే ఏకైక కాగితపు పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్పత్తి పునరుద్ధరణ విషయమై సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హోం మంత్రి, ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం (హెచ్ఎంఎస్) అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి, జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రాంకృష్ణారావు, కార్మిక సంఘం నాయకులు హైదరాబాద్‌లోని సచివాలయంలో బ్యాంకర్లతో కలిసి సమావేశమయ్యారు.
ఎస్పీఎం యాజమాన్యం నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు. అయితే మిల్లులో తిరిగి ఉత్పత్తిప్రారంభించేందుకు అవసరమైన రుణాల మంజూరుకు బ్యాంకర్లు సుముఖత వ్యక్తం చేసినట్లు చర్చల్లో పాల్గొన్న గుర్తింపు కార్మిక సంఘం హెఎంఎస్ ప్రధాన కార్యదర్శి ఈర్ల విశ్వేశ్వర్రావు ‘సాక్షి’ప్రతినిధితో ఫోన్లో పేర్కొన్నారు. ఈ విషయమై ఈ నెల 9న మరోమారు సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు.
వంద రోజులుగా కార్మికుల పోరాటం..
ముడిసరుకు కొరత, నష్టాల పేరుతో ఎస్పీఎం యాజమాన్యం 2014 సెప్టెంబర్ 27న ఉత్పత్తి నిలిపివేసింది. ఈ మిల్లులో పనిచేసే ఉద్యోగులు, శాశ్వత కార్మికులకు వేతనాలు చెల్లించడం నిలిపివేసింది. దీంతో మిల్లుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న సుమారు మూడు వేల మంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి కరువైంది. వీరితోపాటు పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. దీంతో ఎలాగైనా మిల్లులో ఉత్పత్తిని ప్రారంభించి, కార్మిక, ఉద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని గుర్తింపు కార్మిక సంఘంతోపాటు, అన్ని సంఘాలు ఉద్యమబాట పట్టాయి.
ఐక్య కార్యాచరణగా ఏర్పడి డిసెంబర్ 22 నుంచి ఎస్పీఎం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. కానీ.. యాజమాన్యం నుంచి కనీస స్పందన లేకుండా పోయింది. కంపెనీకి నష్టాలు వచ్చిన నేపథ్యంలో మరోమారు రుణాలు మంజూరు చేస్తే ఉత్పత్తి ప్రారంభిస్తామని మిల్లు యాజమాన్యం బ్యాంకర్లను సంప్రదించింది. గుర్తింపు సంఘం అధ్యక్షుడిగా హోంమంత్రి వ్యవహరిస్తున్నా మిల్లు నిర్వహణపై ఎలాంటి స్పష్టత రావడం లేదు.
మిల్లులో తిరిగి ఉత్పత్తి ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యాజమాన్యానికి అవసరమైన రుణాలు మంజూరయ్యేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ యాజమాన్యం ఉత్పత్తిని ప్రారంభించేందుకు నిరాకరిస్తే మిల్లును ప్రభుత్వం అధీనంలోకి తీసుకోనైనా, అవసరమైతే ఏదైనా ప్రైవేటు యాజమాన్యానికైనా ఈ మిల్లు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కార్మికులు, ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్యాంకర్లు, మిల్లు యాజమాన్యంతో చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సోమవారం హైదరాబాద్‌లో సమావేశం కొనసాగింది.
- Sakshi News Paper