-రాష్ట్రంలో శిల్పకళ అద్భుతం -జర్మనీ భౌగోళిక శాస్త్రవేత్త జూలియా విక్రమ్ గణపురం : తెలంగాణ రాష్ట్రంలో ఇంత అద్భుతమైన శిల్ప కళ ఉంటుంద...
-రాష్ట్రంలో శిల్పకళ అద్భుతం
-జర్మనీ భౌగోళిక శాస్త్రవేత్త జూలియా విక్రమ్
గణపురం : తెలంగాణ రాష్ట్రంలో ఇంత అద్భుతమైన శిల్ప కళ ఉంటుందని తన భర్త విక్రమ్‌తో సందర్శించిన తర్వాతే తెలిసిందని జర్మనీ భౌగోళిక శాస్త్రవేత్త జూలియా పేర్కొన్నారు. ఆమె ఆదివారం వరంగల్ జిల్లా గణపురంలోని గణపేశ్వరాలయాన్ని భర్త, అత్తమామలతో కలిసి సందర్శించారు. అనంతరం జూలియా మాట్లాడుతూ జర్మనీకి చెందిన తనతోపాటు హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ డైరెక్టర్‌గా అమెరికాలో పనిచేశాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం పెండ్లికి దారితీసిందన్నారు. తెలంగాణ కోడలిగా ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూడడానికి వచ్చానని వివరించారు.
ముఖ్యంగా తెలంగాణలో కాకతీయులను గొప్ప రాజులుగా, దేవతలుగా పూజించేవారని తెలుసుకుని, వారు కట్టిన దేవాలయాలను సందర్శించి ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నానన్నారు. జర్మనీలో ఇంత గొప్ప దేవాలయాలు, చరిత్ర కానీ లేదన్నారు. వరంగల్ జిల్లాలోని వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప, గణపేశ్వరాలయాల శిల్ప సంపద చూడడం తనకు మొదటిసారని, దేశవిదేశాల్లో ఇలాంటి అపురూప శిల్పాలు అరుదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి ఇంతటి చరిత్ర, ఇంత గొప్ప శిల్పసంపద ఉందని తాను ఇతర దేశాల ప్రజలకు కూడా నెట్ ద్వారా తెలియజేస్తానని చెప్పారు. అనంతరం గణపేశ్వరాలమంలో రామలింగేశ్వరుని వద్ద అత్తమామలు హన్మంతరెడ్డి, లలిత, భర్త విక్రమ్‌తో కలిసి జూలియా ప్రత్యేక పూజలు చేశారు.