హైదరాబాద్: హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) తుది జాబితాలో తెలంగాణకు తలమానికమైన ఓరుగల్లు పట్టణానికి మళ్లీ స్థా...
హైదరాబాద్: హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) తుది జాబితాలో తెలంగాణకు తలమానికమైన ఓరుగల్లు పట్టణానికి మళ్లీ స్థానం దక్కింది. వాస్తవంగా ఈ ప్రాజెక్టు కోసం 12 నగరాలను ఎంపిక చేస్తూ ముసాయిదా మార్గదర్శకాలను గతంలోనే కేంద్రం జారీ చేసింది. అనంతరం ఈనెల 13వ తేదీన తుది మార్గదర్శకాలంటూ రూపొందించిన జాబితాలో కేవలం ఏడు నగరాలకే స్థానం కల్పించింది. వరంగల్‌తోపాటు ఏపీలోని అమరావతికి తుది జాబితాలో చోటుదక్కలేదు.
దీంతో మార్గదర్శకాలను పున:పరిశీంచి ఏడు నగరాలకు బదులుగా 12 నగరాలకు స్థానం కల్పిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ తిరిగి నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హృదయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తుది నివేదికను అధికారిక వెబ్సైట్ ద్వారా సోమవారం సాయంత్రం 4.42 గంటలకు అందుబాటులోకి తెచ్చింది. కాగా వరంగల్ నగరాభివృద్ధికి సంబంధించిన చేపట్టాల్సిన ప్రాజెక్టుపై వరంగల్ కమిషనర్ ఈనెల 21న ఢిల్లీలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. తాజా జాబితాలో వరంగల్, అమరావతి, అమృత్సర్, అజ్మీర్, మధుర, గయ, కాంచీపురం, వెల్లంగి, వారణాసి, పూరి, ద్వారక, బదామి, నగరాలు చోటు సంపాదించాయి. ఈ చారిత్రక నగరాల అభివృద్ధికి వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని పట్టణాభివృద్ధిశాఖ తెలిపింది.
పర్యాటక ప్రాంతాల అనుసంధానం, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా, టాయిలెట్స్, నీటి సరఫరా, వీధి దీపాల వ్యవస్థను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తామని మార్గదర్శకాల్లో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సంబంధిత మున్సిపాలిటీతో త్రైపాక్షిక ఒప్పందం జరిగిన తర్వాత ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఆమోదం లభించగానే కేంద్రం వాయిదాల పద్ధతిలో నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు.