హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నతవిద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలపై దృష్టి సారించింది. పరిపాలనలో సుశిక్షిత...
హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నతవిద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలపై దృష్టి సారించింది. పరిపాలనలో సుశిక్షితులైన ఐఏఎస్ అధికారులను రిజిస్ట్రార్లుగా నియమించే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. దీంతో అటు విద్యాపరంగా, ఇటు పరిపాలనపరంగా యూనివర్సిటీలు ప్రపంచస్థాయికి చేరుతాయని సర్కారు విశ్వసిస్తున్నది. అనేక ఆరోపణలు, అవకతవకలకు యూనివర్సిటీలు కేంద్రాలయ్యాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో విద్యా బోధనతోపాటు విశ్వవిద్యాలయాల పరిపాలనను గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. వైస్‌చాన్స్‌లర్లుగా కూడా ఐఏఎస్‌లనే నియమించాలని సర్కారు తొలుత భావించినప్పటికీ విద్యావేత్తలను మాత్రమే వీసీలుగా నియమించే సంప్రదాయాల నేపథ్యంలో ఈ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తున్నది.
కీలకమైన రిజిస్ట్రార్ పదవుల్లో ఐఏఎస్‌లను నియమిస్తే యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పెరగడంతోపాటు, పరిపాలన సవ్యంగా సాగుతుందని సర్కారు యోచిస్తున్నది. బోధనలో సుశిక్షితులైన విద్యావేత్తలు, పరిపాలనలో శిక్షణ పొందిన ఐఏఎస్‌ల సమన్వయంతో వర్సిటీలు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిని అందుకోగలవని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది. రిజిస్ట్రార్లుగా యువ ఐఏఎస్ అధికారులను పరిశీలించే అవకాశం కనబడుతున్నది. రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీలున్నాయి. జేఎన్టీయూహెచ్, తెలుగు యూనివర్సిటీ లాంటివాటితోపాటు కొత్తగా కాళోజీ వైద్య యూనివర్సిటీ, బీఆర్ అంబేద్కర్, ఫైన్ ఆర్ట్స్, వ్యవసాయ యూనివర్సిటీ లాంటివి ప్రత్యేకంగా ఉన్నాయి.
రాష్ట్రంలోని ఈ వర్సిటీలన్నింటికీ వీసీలను గవర్నర్ నియమిస్తారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే సెర్చ్‌కమిటీల నుంచి వచ్చే ప్రతిపాదనల ప్రకారమే ఈ నియామకం ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్సిటీల్లోని కీలక బాధ్యతలను విద్యావేత్తలు, ఐఏఎస్ అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.