హన్మకొండ : వన్ ప్లస్ వన్ ఇంటి నిర్మాణాలపై గీసుకొండ మండలం అమీర్‌నగర్(గరీబ్‌నగర్ కాలనీ) వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు హన్మకొండ న...

హన్మకొండ : వన్ ప్లస్ వన్ ఇంటి నిర్మాణాలపై గీసుకొండ మండలం అమీర్‌నగర్(గరీబ్‌నగర్ కాలనీ) వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు హన్మకొండ నక్కలగుట్టలోని చల్లా ధర్మారెడ్టి ఇంటి వద్దకు చేరుకుని ఆదివారం ధర్నా చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటి ఆవరణలో బైఠాయించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శనివారం గరీబ్నగర్ను సందర్శించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వన్ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే వన్ ప్లస్ వన్ పద్ధతిని నిరసిస్తూ గరీబ్‌నగర్ వాసులు ఎమ్మెల్యే ఇంటి ఆవరణలో ఆందోళనకు దిగారు. తమకు పట్టా సర్టిఫికెట్లు ఇస్తే చాలని.. ఇళ్లు కూడా నిర్మించాల్సిన అవసరం లేదని కాలనీవాసులు పేర్కొన్నారు. అప్పటికీ ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే కాలనీవాసులు చెప్పిన అంశాలు విని తాను మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పి వెళ్లిపోయారు. అయినా వారు వెళ్లిపోలేదు.
వరంగల్ సాకరాసికుంటలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి, మహాబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, టీఆర్‌ఎస్‌జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటి వద్దకు చేరుకున్నారు. వారు గుడిసెవాసులతో మాట్లాడుతూ తాము సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ముందుగా అన్నివర్గాలకు ప్రాతినిథ్యం ఉండేలా కాలనీ కమిటీ వేసుకోవాలని కమిటీలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉండాలని సూచించారు. కాలనీ వారి నిర్ణయం మేరకు నడుచుకుందామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజులుగా ఇక్కడే ఉండి గుడిసెవాసులకు పక్కాఇళ్లు నిర్మించి ఇస్తామని చెబితే నిరసన తెలపడం మంచి పద్ధతి కాదని, ఇళ్లకు వెళ్లిపోవాలని కోరారు. దీంతో శాంతించిన గరీబ్ నగర్ వాసులు ఆందోళన విరమించి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిపోయారు.