తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే 66వ గణతంత్ర దిన వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరేడ్ మైదా...
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే 66వ గణతంత్ర దిన వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరేడ్ మైదానాన్ని చదును చేసి, వీఐపీలు, విద్యార్థులు, ప్రేక్షకులు అనువుగా తీర్చిదిద్దారు. అతిథులు కూర్చోవడానికి షామియానాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృధ్ధి కార్యక్రమాలను తెలియపరిచేందుకు ప్రత్యేక స్టాళ్ల కోసం ప్రత్యేక శిబిరాలను కేటాయించారు. పోలీసుల కవాతు, విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాల కోసం మైదానాన్ని సిద్ధం చేశారు. ఏర్పాట్లను ఎస్పీ తరుణ్ జోషీ స్వయంగా పరిశీలించారు. పోలీసులు వేడుకల్లో నిర్వహించే కవాతు కార్యక్రమానికి సంబంధించిన రిహార్సల్‌ను ఆదివారం ఉదయం తిలకించారు. లోటుపాట్లను సవరించారు. ఎన్సీసీ కెడెట్లు కావాతులో మంచి యూనిఫాంతో రావాలని ఎన్సీసీ అధికారలులకు సూచించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో నిర్వహించే కార్యక్రమాలు ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. బాలబాలికలతో ప్రభాత్భేరి కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటలకు పరేడ్ మైదానంలో కలెక్టర్ ఎం జగన్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 9:05 గంటలకు పోలీసు కవాతు అనంతరం కలెక్టర్ గౌరవ వందనం స్వీకరిస్తారు. 9:15కు జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్ ప్రసంగిస్తారు. 9:25 గంటలకు విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేస్తారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఆధికారుల, ఉద్యోగులకు అవార్డులు అందజేస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు. 11:00 గంటలకు రిమ్స్ అసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తారు.
జిల్లాకు 30 మంది కళాభారతి కళాకారులు
గణతంత్ర వేడుకలను పుస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో సాయంత్రం 6:30 గంటలకు కొత్తగా జయహో తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. రాష్ట్ర రాజధానికి చెందిన శత కళాభారతి నుంచి 30 మంది కళాకారులతో జయజయహే తెలంగాణ గీతాలాపన, సంసృ్కతిక నృత్యప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. యువకులు, విద్యార్థులతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల వరుకు నిర్వహించే కార్యక్రమాల్లో జిల్లా ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పాల్గొననున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ నుంచి కళాకరులను రప్పించి జయహో తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్ తెలిపారు.