జంతుప్రేమను చాటుకున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బెంగళూరు, జనవరి 7: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం.. అత్యంత రద్దీగా ఉండే కెంపెగౌడా అ...
జంతుప్రేమను చాటుకున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు, జనవరి 7: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం.. అత్యంత రద్దీగా ఉండే కెంపెగౌడా అంతర్రాష్ట్ర బస్సు స్టేషన్ ప్రాంతం.. అరుదుగా కనిపించే వింత తంతును చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు. ఇంతలో శుభ్రంగా స్నానం చేయించి, అందంగా అలంకరించిన రెండు గాడిదను తీసుకొచ్చారు కొందరు వ్యక్తులు. వాళ్లలో తెల్లదుస్తులు.. నల్ల కళ్లజోడు, నల్ల టోపీ ధరించిన ఓ పెద్దమనిషి తన చేతిలోని ముత్యాలహారాన్ని గాడిద మెడలో వేశాడు. గులాబీ రెమ్మల్ని వాటిపై జల్లాడు. శాలువాలు కప్పి సత్కరించాడు.
అంతటితో ఊరుకోలేదు.. కర్ణాటక ప్రభుత్వం ప్రఖ్యాత వ్యక్తులకు ప్రకటించే రాజ్యోత్సవ అవార్డును గాడిదకు ప్రకటించాడు. ఇంతకీ ఆ సన్మానకర్త ఎవరంటే.. కర్ణాటకలోని చమరాజనగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాటాల్ నాగరాజ్. కన్నడ చలువలి వాటాల్పక్ష అనే రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కూడా. ఇప్పుడిప్పుడే ఎన్నికలూ లేవు.. ఏమిటీ హడావిడీ? అంటే.. నాకు సాధుజంతువులంటే ప్రాణం. గాడిద, ఆవు, బర్రె ఇలాంటి జంతువులన్నీ మనుషులకోసం ఎంతో కష్టపడి పనిచేస్తాయి.
నిజాయితీగా ఉంటాయి. అందుకే వాటిని ఘనంగా సత్కరిస్తుంటాను. అవి మనుషులకంటే ఉన్నతమైనవని భావిస్తాను. రాజ్యోత్సవ అవార్డు ప్రదానంచేసిందికూడా అందుకే అని తన ఉద్దేశాన్ని చెప్పాడు. ఇంతకుముందు కూడా సాధుజంతువుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ పలు సత్కారకార్యక్రమాలు చేశాడు నాగరాజ్!