- ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి హైదరాబాద్ : జాతీయస్థాయిలో జరుగుతున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణతో సింగరేణికి స...
హైదరాబాద్ : జాతీయస్థాయిలో జరుగుతున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణతో సింగరేణికి సంబంధం లేదని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంబంధంలేని అంశాలపై సింగరేణి కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం బాధాకరమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మెలో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకెళ్లుతున్నారని, విషయంలో సింగరేణి కార్మికులు సహకరించాలని కోరారు. సమ్మె వల్ల పరిశ్రమలు, వ్యవసాయరంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్నారు. కొన్ని జాతీయ సంఘాలు తమ ఉనికి కోసం కార్మికులను రెచ్చగొడుతున్నాయని, ఈ విషయాన్ని కార్మికులు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థకు ఎటువంటి నష్టం జరగకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
యథావిధిగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి
జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు సింగరేణి సంస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. సమ్మె మొదటి రోజు మంగళవారం కార్మికులు సమ్మెకు దూరంగా ఉన్నారు. మొదటి షిఫ్టులో అన్ని ఏరియాలలో 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది. సహకరించిన గుర్తింపు కార్మిక సంఘం, ఇతర కార్మిక సంఘాలకు యాజమాన్యం అభినందనలు తెలియజేసింది.