హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెద్దపులుల సంతతి క్రమంగా పెరుగుతున్నదని ప్రముఖ జీవశాస్త్ర నిపుణులు, పెద్దపులుల పరిశోధకులు డాక్టర్ ఉల్లాస్ కర...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెద్దపులుల సంతతి క్రమంగా పెరుగుతున్నదని ప్రముఖ జీవశాస్త్ర నిపుణులు, పెద్దపులుల పరిశోధకులు డాక్టర్ ఉల్లాస్ కరాంత్ తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాలను కఠినంగా అమలుచేయడంవల్ల పరిస్థితి మెరుగుపడుతున్నదన్నారు. బతుకుబాటలో పెద్దపులి అన్న అంశంపై అటవీశాఖ కేంద్ర కార్యాలయంలో గురువారం అధికారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఉల్లాస్ కరాంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో దట్టమైన అడవులున్నప్పటికీ పెద్దపులుల సంఖ్య ఆశించినస్థాయిలో పెరుగలేదన్నారు. దేశవ్యాప్తంగా పెద్దపులుల ఉనికి పెరుగుతున్నదని ఇటీవల తమ పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. ఒక్క కర్ణాటకలోనే పెద్దపులులు 400కుపైగా ఉన్నట్లు తాము గుర్తించామని వివరించారు.
దేశవ్యాప్తంగా 30వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దట్టమైన అడవులుండగా, రెండు లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో పెద్దపులుల సంచారం ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని గుండ్ల బ్రహ్మేశ్వరం, ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లోని నల్లమల అడవులు పెద్దపులుల సంతతి పెరుగడానికి అనువుగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ఫారెస్ట్ యుటిలైజేషన్ ఆఫీసర్ రామకృష్ణారావు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో కవ్వాల్, ప్రాణహిత లాంటి ప్రాంతాలు పెద్దపులుల మనుగడకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.