హైదరాబాద్ : కూలిపని చేసుకొనే ఓ మహిళ ఏకంగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌నని అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతోంది. నాలుగు పెళ్ల...
హైదరాబాద్ : కూలిపని చేసుకొనే ఓ మహిళ ఏకంగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌నని అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతోంది. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఈ కి‘లేడీ’ తనను వేధిస్తున్నారని కేసులు పెట్టి భర్తలను కోర్టుల చుట్టూ తిప్పుతోంది. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నిత్య పెళ్లి కూతురిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు అలియాస్ రాణి, అలియాస్ బుజ్జి, అలియాస్ అలేఖ్యారెడ్డి జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి సరూర్‌నగర్‌లో ఉంటూ కూలి పని చేసుకుంది. ఎల్బీనగర్కు చెందిన రవీంద్రను పెళ్లి చేసుకుంది. కొంతకాలం అతడితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం భర్త వేధిసున్నాడని ఎల్బీనగర్ ఠాణాలో కేసు పెట్టింది. తర్వాత బోరబండ మోతీనగర్‌కు వచ్చి జగదీష్‌ను రెండో పెళ్లి చేసుకుని అతడిపై కూడా కేసుపెట్టి పూర్ణచందర్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. చివరగా కరీంనగర్‌కు చెందిన కిషోర్‌ను నాలుగో పెళ్లి చేసుకుంది. ఇటీవల అతనిపై కూడా వేధింపుల కేసుపెట్టి దూరంగా ఉంటోంది. ఒకసారి జైలుకెళ్లి...నిత్య పెళ్లి కూతురుగా మారిన హేమ చివరకు రంగారెడ్డి జిల్లా జేసీగా, ఆర్ఐగా పలువురిని పరిచయం చేసుకొని మోసాలకు తెరలేపింది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇళ్లు ఇప్పిస్తానని చాలామంది నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసింది. జాయింట్ కలెక్టర్‌గా నమ్మించడంతో ఉన్నత చదువులు చదివిన అనేక మంది యువతీ,యువకులు ఆమెకు డబ్బు చెల్లించారు. నగరంలోని ఆరు స్టేషన్లలో ఆమెపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో ఎల్బీనగర్ పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపారు. బయటకు వచ్చాక మళ్లీ మోసాలకు పాల్పడుతూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతోంది.