-వెలుగులోకి తెచ్చిన ద్యావనపల్లి హైదరాబాద్: మానవుడి చరిత్రకు మాత్రమే కాకుండా అతడి లలితకళలకు కూడా మొట్టమొదటి ప్రధాన ఆధారాలైన చిత్రలేఖనాలు...
-వెలుగులోకి తెచ్చిన ద్యావనపల్లి
హైదరాబాద్: మానవుడి చరిత్రకు మాత్రమే కాకుండా అతడి లలితకళలకు కూడా మొట్టమొదటి ప్రధాన ఆధారాలైన చిత్రలేఖనాలు రాతి గుహల్లో కన్పిస్తున్నాయి. తెలంగాణలో అలాంటివి ఇప్పటి వరకు 18 స్థలాల్లో కన్పించాయి. ఈ మధ్య అలాంటి రాతి చిత్రలేఖనాలను పరిశోధకుడు డాక్టర్ ద్యావనపల్లి మరో రెండు స్థలాల్లో గుర్తించారు. ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలం నల్లముడి గ్రామశివారు అటవీ గుహల్లో ఆయన వీటిని కనుగొనానరు. ఇక్కడికి ఖమ్మం జిల్లా పాల్వంచ-మాదారం-కమలాపూర్ మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు.
చరిత్ర పూర్వ యుగపు చిత్రలేఖనాలున్న గుహను స్థానిక నాయకపోడు గిరిజనులు అక్షరాల లొద్ది అని పిలుస్తారు. సుమారు పది మీటర్ల పొడవు, ఏడు మీటర్ల ఎత్తులో దక్షిణాభిముఖంగా సెలయేరు ఒడ్డున ఉన్న ఈ గుహలో మూడు యుగాల మూడు రకాల చిత్రలేఖనాలున్నాయి. ఈ గుహలో ఎరుపు రంగు చిత్రాలు, రేఖా చిత్రాలు (తొలిచినవి), తొలిచిన చిత్రాల్లో రంగు పూసినవి మొత్తం మూడు రకాల చిత్రలేఖనాలున్నాయి. చివరి చిత్రాలు చాలా అరుదైనవని ఆయన తెలిపారు.. ఇలాంటివి మహబూబ్నగర్ జిల్లా దొంగలబండ తండాలో, ఒడిశాలో ఒక చోట, దక్షిణాఫ్రికా, స్పానిష్ కాండబ్రియాలో ఇప్పటి వరకు వెలుగుచూశాయని నిపుణులు రాశారని పేర్కొన్నారు.
ఇవి మధ్యరాతి యుగానికి అంటే ఇప్పటికీ కనీసం ఐదువేల సంవత్సరాల కిందటివి. ఈ చిత్రాల్లో ప్రధానంగా జంతువులు, దేవతలు, మానవ కార్యకలాపాలు కన్పిస్తున్నాయి. తెలంగాణకు ఆనాడే ఇతర ప్రాంతాలతో గల వ్యాపార సంబంధాలను, వ్యవసాయ ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయని ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు. బాణం పుల్లను నిలబెట్టినట్లు ఏడు చిత్రాలు సప్తమాతృకలకు సప్తసంతానాలను ఇచ్చే దేవతలుగా చెప్పవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఓం అక్షరానికి పూర్వరూపంగా మేధావులు భావిస్తున్న స్వస్తిక్ చిత్రంతో మన ఘన సంస్కృతి వారసత్వం పట్ల మనకు గౌరవం ఇనుమడిస్తుందన్నారు.
ఈ చిత్రాల్లో చాలా వరకు రాక్షస గుళ్ళ యుగానికి చెందినదని ప్రాథమిక పరిశోధనలో తేలింది. ఏమైనా ఇక్కడి చిత్రాలు, వాటిని దైవంగా భావించిన ప్రజలు క్రీ.పూ. 3 వేల సంవత్సరాల నుంచి క్రీ. శ. 2వ శతాబ్దం మధ్య మనుగడ సాగించారని చెప్పవచ్చునన్నారు. ఈ చిత్రాలు విధ్వంసానికి గురికాకముందే ప్రభుత్వ పురావస్తు శాఖ వాటిని కాపాడి భావితరాలకు అందించాలని కోరారు. ఈ నెల 8న ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి 63వ జన్మదినం వారికి తన పరిశోధనను అంకితం చేస్తున్నట్లు తెలిపారు.