పేద అమ్మాయిల జీవితాలతో అరబ్ షేక్‌ల ఆటలు చాంద్రాయణగుట్ట: పాతబస్తీలోని నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అభం శుభం తెలియని అమ్మాయిల జ...

చాంద్రాయణగుట్ట: పాతబస్తీలోని నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అభం శుభం తెలియని అమ్మాయిల జీవితాలతో అరబ్ షేక్‌లు చెలగాటమాడుతున్నారు. తృణమో.... ఫణమో వారి కుటుంబ సభ్యులకు అందజేసి తమ అవసరాలను తీర్చుకునేందుకు బాలికలతో నిఖా చేకుని వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. గతంలో ఓ అరబ్ షేక్ నిఖా జరిపించుకొని బాలిక అమీనాను అరబ్ తీసుకెళుతుండగా ఎయిర్ హోస్టెస్ అడ్డుకున్న ఘటన తెలిసిందే. దీంతో ట్రెండ్ మార్చిన షేక్‌లు నిఖా చేసుకుని ముచ్చటగా మూన్నెళ్ల పాటు ఇక్కడే కాపురం పెడుతున్నారు. స్థానిక దళారుల సహకారంతో ఈ దొంగ నిఖాల తతంగం దర్జాగా కొనసాగుతోంది.
దీంతో తల్లిదండ్రులను ఎదురించలేని స్థితిలో ఎంతో మంది అమాయక బాలికలు అరబ్బు షేక్‌ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇందులో భాగంగానే శనివారం నిఖా జరిపిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా కాజీలు, రాజకీయ నాయకుల అండదండలతోనే షేక్‌లు, దళారులు ఈ దుస్సాహాసానికి ఒడిగడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ ముస్లింల పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని అరబ్బు షేక్‌లు ఈ దారుణాలకు ఒడిగడుతున్నారని పాతబస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మురికివాడలే టార్గెట్.
పాత బస్తీలోని నిరక్షరాస్యత, బహు సంతానం కారణంగా పేద ముస్లిం కుటుంబాలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయి. వృత్తిపై వచ్చే ఆదాయం, ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో వారు అమ్మాయిల పెళ్లిళ్లు చేయలేక నిస్సాహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పాతబస్తీ పరిధిలోని ఫలక్‌నుమా, బార్కాస్, సలాల, తలాబ్‌కట్టా, భవానీనగర్, అమన్‌నగర్, తీగలకుంట, జహనుమా, తాడ్బన్ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. బ్రోకర్లు ఇలాంటి కుటుంబాలను టార్గెట్‌గా చేసుకుని డబ్బు ఎరగా వేస్తుంటారు. నిఖా జరిపిస్తే సదరు షేక్ దుబాయి తీసుకెళతాడంటూ కల్లబొల్లి మాటలు చెప్పి వారిని ముగ్గులోకి దించుతారు. ఇందుకు గాను కుటుంబ పెద్దకు అంతో..ఇంతో ముట్టజెప్పడంతో వారు అమాంతం కరిగిపోయి తమ బిడ్డలను కట్టుబట్టలతో షేక్‌ల చేతిలో పెడుతున్నారు. కాగా ఇలాంటి బోగస్ నిఖాలు జరిపిస్తున్న ముగ్గురు కాజీలపై దక్షిణ మండలం పోలీసులు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడంతో పాటు దళారీ అక్బర్‌పై పి.డి.యాక్ట్ ప్రయోగించారు.
తండ్రిని చూపించలేని అభాగ్యులెందరో..
నిఖా చేసుకున్న షేక్‌లు కొద్ది రోజులు అమ్మాయిలతో కాపురం చేసి అనంతరం ఖాజీల సమక్షంలో తలాక్..తలాక్..తలాక్ అనే మూడు మాటలు చెప్పి ఎంచక్కా తమ దేశాలకు ఎగిరిపోతున్నారు. అలా వెళ్లిపోయిన ముసలి మొగుడు తిరిగివస్తాడని మహిళలు కళ్లల్లో వత్తులేసుకొని జీవితాంతం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా షేక్‌ల పుణ్యమాని సంతానానికి నోచుకున్న మహిళలు పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తండ్రి కోసం వాకబు చేస్తే చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
మధ్యలోనే వదిలేస్తున్న షేక్‌లు
నిఖా చేసుకున్న తర్వాత షేక్‌లు మూడు నెలలు ఇక్కడ కాపురం చేసి తమ దేశాలకు తీసుకెళుతామంటూ అమ్మాయిలను మధ్యలోనే వదిలేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అరబ్ తీసుకెళుతున్నామంటూ కుటుంబ సభ్యులను నమ్మించి, ఆ తర్వాత ముంబై వరకు తీసుకెళ్లి అక్కడ ఒంటరిగా వదిలేసి పలాయనం చిత్తగిస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధిత మహిళలు అతికష్టం మీద హైదరాబాద్‌కు చేరుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొందరు మహిళలు ఏకంగా తమకు అరబ్ దేశాల పౌరసత్వం కావాలంటూ ఆయా దేశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.