న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం రాత్రి 11:30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఐదు రోజులపాటు (10వ తేదీ వ...
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం రాత్రి 11:30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఐదు రోజులపాటు (10వ తేదీ వరకూ) ఆయన హస్తినలోనే ఉంటారు. 8న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ‘నీతి ఆయోగ్’ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో 11 మంది కేంద్ర మంత్రులను కేసీఆర్ కలుస్తారని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను, 2.15 గంటలకు పర్యావరణ్ భవన్లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను, 4 గంటలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మను కలుస్తారని చెప్పారు.
పర్యావరణ అనుమతులపై జవదేకర్‌తోనూ, రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ స్థానాల పెంపుపై హెచ్.ఎస్.బ్రహ్మతోనూ కేసీఆర్ చర్చిస్తారని వివరించారు. 9వ తేదీ వరకు ఖరారైన అపాయింట్ల మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చౌదరి వీరేంద్రసింగ్, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాలను సీఎం కలుస్తారు. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు రాంవిలాస్‌పాశ్వాన్, సంతోష్ గంగ్వార్‌లను వారి అందుబాటునుబట్టి కలుసుకుంటారు. కేసీఆర్ గతంలో వివిధ మంత్రిత్వశాఖలకు ఇచ్చిన అర్జీలు, తెలంగాణ సమస్యలపై అందచేసిన దరఖాస్తుల్లోని అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈస్ట్రన్ గ్రిడ్ నుంచి తెలంగాణకు 500 మెగావాట్ల మిగులు విద్యుత్ కేటాయింపు, ప్రత్యేక హైకోర్టు, విద్యుత్ కొరత తీర్చడానికి సింగరేణికి కోల్‌బ్లాక్‌లను కేటాయింపుపై ప్రధాని మోదీని కేసీఆర్ కోరనున్నారని వేణుగోపాలచారి తెలిపారు. కాగా, వాస్తవానికి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో గ్రేటర్ సిటీ పార్టీ నాయకులతో సమావేశానికి హాజరు కావాల్సినా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని సచివాలయానికి చేరుకున్నారు. హడావుడిగా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై పలు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. వెంటనే వేతన సవరణ నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం రాత్రి మాదాపూర్‌లోని హైటెక్స్‌లో రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వచ్చారు.