-నెలాఖరులోగా 640 వాటర్‌గ్రిడ్ ఇంజినీర్ల భర్తీకి నోటిఫికేషన్ -వారం రోజులలో టీఎస్పీఎస్సీకి ఖాళీల వివరాలు -త్వరలోనే ఇతర శాఖల్లోనూ ఉద్...
-నెలాఖరులోగా 640 వాటర్‌గ్రిడ్ ఇంజినీర్ల భర్తీకి నోటిఫికేషన్
-వారం రోజులలో టీఎస్పీఎస్సీకి ఖాళీల వివరాలు
-త్వరలోనే ఇతర శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీ
హైదరాబాద్,: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. ప్రభుత్వంలో శాఖలవారీగా ఉన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఏయే ప్రభుత్వ శాఖలలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు సేకరించే పనిలో పడింది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు ఇప్పటికే లేఖలు రాసింది. దీంతో ఆయా శాఖాధిపతులు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపే పనిలో ఉన్నారు. ఇప్పటికే శాఖలపరంగా ఖాళీల వివరాలు ప్రభుత్వానికి అందుతున్నట్లు తెలుస్తున్నది. ముందుగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ కోసం మంజూరు చేసిన 640 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని భావిస్తున్నది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు వారంరోజులలో వాటర్‌గ్రిడ్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల వివరాలు పంపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి పోస్టుల వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్లు జారీచేయడానికి టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక టీఎస్పీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులనే స్వీకరించనున్నారు. అందుకోసం సర్వీస్ కమిషన్ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.
వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత రోస్టర్ పాయింట్ విధానాన్ని లెక్కగడతారు. ఆ తర్వాత వారం పది రోజులలో వాటర్‌గ్రిడ్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నోటిఫికేషన్‌కు కొద్దిగా అటు ఇటుగా డిపార్టుమెంటల్ పరీక్ష నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశాలను సర్వీస్ కమిషన్ పరిశీలిస్తున్నది.
-గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకూ ముందస్తు ఏర్పాట్లు..
ప్రస్తుతం రాష్ట్రంలో 1.07 లక్షల పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4తోపాటు అధ్యాపక, ఇంజినీరింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఖాళీల వివరాలు రావాల్సి ఉన్నది. కమల్‌నాథన్ కమిటీ ద్వారా ఖాళీల వివరాలు స్పష్టంగా తెలిసిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే ఈ ఖాళీలకు సంబంధించి మార్చి నెలలో వివరాలు వచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు సిద్ధంగా ఉండాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలిసింది.
ట్రాన్స్‌కో, జెన్కో, ఆర్టీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలలో కూడా ఇంజినీరింగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అలాగే సింగరేణిలో 5,472 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. పాఠశాల విద్యాశాఖలోనూ ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సాధ్యమైనంత త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 20వేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.