హైదరాబాద్: పార్టీ బలోపేతమే లక్ష్యంగా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి టీఆర్ఎస్కు చెందిన ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ...
హైదరాబాద్: పార్టీ బలోపేతమే లక్ష్యంగా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి టీఆర్ఎస్కు చెందిన ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని కొంపల్లిలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి దాకా పనిచేసిన పార్టీ కమిటీలను, అనుబంధ కమిటీలను అన్ని స్థాయిల్లోనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ స్థానే రాష్ట్ర స్టీరింగ్(అడ్హాక్) కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 24వ తేదీన మరోసారి రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తామని, అందులోనే పార్టీ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని, అదే నెల 27న సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సభ్యత్వ నమోదు తర్వాత తనతో సహా 30 లక్షల మంది కార్యకర్తలకు ఏదైనా జరిగితే రూ. 2 లక్షల సాయమందేలా గ్రూప్ ఇన్సూరెన్స్ చెల్లిస్తామని, ప్రతీ కార్యకర్తకు గుర్తింపు కార్డులు అందిస్తామని చెప్పారు. సభ్యత్వ నమోదు వివరాలను ఏరోజుకారోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 20 వరకు ఆన్లైన్లో అందిన వాటినే సిసలైన సభ్యత్వాలుగా గుర్తిస్తామన్నారు. కమిటీల ఎన్నిక తర్వాత తెలంగాణ భవన్లో శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు. కాగా, స్టీరింగ్ కమిటీకి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కన్వీనర్‌గా మరో 11 మందిని సభ్యులుగా నియమించారు. మహిళల సభ్యత్వానికి సంబంధించి ప్రస్తుత మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమను తాత్కాలిక కన్వీనర్‌గా నియమించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో సభ్యత్వ నమోదు కోసం అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసినా, కొన్ని మార్పులుచేర్పులు ఉన్నందున ప్రకటించలేదు. రాష్ట్ర స్థాయి కమిటీలో ఉన్న సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తారని సీఎం తెలిపారు. జిల్లాలు, నియోజకవర్గాలవారీగా సభ్యత్వ పుస్తకాలను వెంటనే తీసుకు వెళ్లాలని, సభ్యత్వ నమోదుకు ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ముఖ్య నేతలంతా సమన్వయంతో పనిచేసి క్రమశిక్షణతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో సాధారణ సభ్యత్వం 25 వేలు, క్రియాశీలక సభ్యత్వం 5 వేలు కలిపి 30 వేల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలోనే కేసీఆర్ సమక్షంలో గట్టు రామచందర్‌రావు, నర్సింగరావు టీఆర్ఎస్లో చేరారు. ఇదే స్టీరింగ్ కమిటీ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో 24 గంటలు అందుబాటులో ఉండే వారితోనే స్టీరింగ్ కమిటీ ని ఏర్పాటు చేసినట్లు కే సీఆర్ పేర్కొన్నారు. కమిటీ కన్వీనర్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సభ్యులుగా రాజయ్య యాదవ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మందుల సామేలు, సయ్యద్ అక్బర్ హుస్సేన్, గ్యాదరి బాలమల్లు, బొంతు రామ్మోహన్, సత్యవతి రాథోడ్, ఆర్.శ్రవణ్‌కుమార్‌రెడ్డి, జెల్లా మార్కండేయులు, పురాణం సతీష్, రూప్సింగ్ పేర్లను ఆయన ప్రకటించారు.