warangal map -ప్రభుత్వానికి 899 చెరువుల అంచనాలు -472 చెరువులకు పరిపాలన అనుమతులు -366 చెరువుల పనులకు టెండర్ల ప్రక్రియ -70 చెరువులకు కాంట...
![]() |
| warangal map |
-472 చెరువులకు పరిపాలన అనుమతులు
-366 చెరువుల పనులకు టెండర్ల ప్రక్రియ
-70 చెరువులకు కాంట్రాక్టర్ల అగ్రిమెంటు
-ఇరిగేషన్ ఎస్ఈకి మంత్రి హరీశ్ అభినందనలు
హన్మకొండ, నమస్తే తెలంగాణ : చెరువుల పునరుద్ధరణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం అమల్లో జిల్లా నెంబర్‌వన్ స్థానంలో ఉంది. తొలి దశలో పునరుద్ధరించటానికి గుర్తించిన చెరువుల అంచనాలు తయారు చేసి పరిపాలన అనుమతి కోసం ప్రభుత్వానికి పంపడంలో ఇతర జిల్లాల కంటే వరంగల్ జిల్లా ముందంజలో ఉండటం విశేషం. 1173 చెరువులకు గాను నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటివరకు 899 చెరువుల పునరుద్ధరణ కోసం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం 472 చెరువుల పునరుద్ధరణ పనులకు పరిపాలన అనుమతి ఇస్తూ రూ.300కోట్లకు పైగా నిధులు కేటాయించింది.
ఈ నిధులతో 366 చెరువులకు టెండర్లు పిలిచిన నీటి పారుదల శాఖ ఇంజినీర్లు 70 చెరువుల పునరుద్ధరణ పనులు పొందిన కాంట్రాక్టర్లతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అగ్రిమెంటు జరిగిన 70 చెరువుల మట్టి నమూనాలు సేకరించిన వ్యవసాయశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు నివేదికనూ అందజేశారు. మిషన్ కాకతీయపై తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తమ శాఖ వరంగల్ పర్యవేక్షక ఇంజినీరు(ఎస్ఈ) వి.పద్మారావుకు అభినందనలు తెలిపారు.
అంచనాల తయారీలో ముందంజ
దశలవారీగా ఐదేళ్లలో చెరువులన్నింటినీ పునరుద్ధరించాలనే టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తొలి విడుత నీటి పారుదల శాఖ అధికారులు 2014-15 సంవత్సరం కోసం ఇరవై శాతం అంటే 1173 చెరువులను గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదట ఈ చెరువుల పునరుద్ధరణ పనుల కోసం సర్వే నిర్వహించారు. అంచనాలు తయారు చేయడం మొదలు పెట్టిన సమయంలో మిషన్ కాకతీయ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడానికి డిసెంబరు 9వ తేదీన వరంగల్‌లోని కేఎంసీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు. మిషన్ కాకతీయ లక్ష్యం, ఈ కార్యక్రమం ద్వారా చెరువుల నుంచి తొలగించనున్న పూడికమట్టిని పంట భూములకు తరలించటం వల్ల రైతులకు కలిగే బహుళ ప్రయోజనాలు, తొలి దశలో గుర్తించిన చెరువుల పునరుద్ధరణ పనుల కోసం అంచనాలు తయారు చేయడంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, పునరుద్ధరణ పనుల్లో అక్రమాలకు తావు లేకుండా అనుసరించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు.
ముఖ్యంగా మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపించవద్దని, నిర్దేశిత గడువు లోగా చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ సీజన్లో ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కొద్ది రోజుల తర్వాత నీటి పారుదల శాఖ ఇంజినీర్లకు హైదరాబాద్‌లో హరీశ్‌రావు ల్యాప్టాపులను అందజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలోని సాగునీటి శాఖ ఇంజినీర్లు తొలి విడు త కోసం గుర్తించిన చెరువుల అంచనాలు తయారు చేసి దశల వారీగా పంపుతున్నారు. ఇప్పటి వరకు 899 చెరువుల అంచనాలను ప్రభుత్వానికి పంపారు. తొలి దశ మొత్తం 1173 చెరువుల్లో మరో 274 చెరువుల అంచనాలు ప్రభుత్వానికి అందాల్సి ఉంది. అయితే వీటిలో 103 చెరువుల పునరుద్ధరణ పనుల కోసం అంచనాలు తయారు చేసి ఆర్ఆర్ఆర్ నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపే బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. ఇక మిగిలిన 171 చెరువుల అంచనాల తయారీని మరో వారం రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి పంపే పనిలో ఇరిగేషన్ ఇంజినీర్లు తలమునకలయ్యారు.
-472 చెరువులకు ఆమోదం
దశల వారీగా జిల్లా నుంచి అందిన 899 చెరువుల అంచనాలను పరిశీలించిన ప్రభుత్వం విడుతల వారీగా 472 చెరువుల పునరుద్ధరణ పనుల కోసం రూ.300కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ చెరువుల్లో 366 చెరువుల పనుల కోసం నీటి పారుదల శాఖ అధికారులు దశలవారీగా టెండర్ల ప్రక్రియ చేపట్టారు. తొలి దశలో సర్కిల్, డివిజన్లలో టెండర్లు ఆహ్వానించిన 70 చెరువుల పనులను ఈ-ప్రొక్యూర్‌మెంటు పద్ధతిన దక్కించుకున్న గుత్తేదార్లు కొద్ది రోజుల కిందట నీటి పారుదల శాఖతో అగ్రిమెంటు కూడా కుదుర్చుకున్నారు. పనులు ప్రారంభించటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 366 చెరువుల్లో మిగతా 294 చెరువుల టెండర్ల ప్రక్రియ సర్కిల్, డివిజన్లలో ఈ నెలాఖరులోగా పూర్తి చేసే పనిలో ఇరిగేషన్ ఇంజినీర్లు నిమగ్నమయ్యారు.
పరిపాలన అనుమతి పొందిన మరో 106 చెరువుల పనుల కోసం రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలువనున్నట్లు ఇరిగేషన్ ఎస్ఈ వి.పద్మారావు నమస్తే తెలంగాణకు చెప్పారు. మిషన్ కాకతీయపై సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల సాగు నీటి శాఖ అధికారులతో మం త్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తొలి విడుత కోసం గుర్తించిన చెరువుల అంచనాల తయారీ, పరిపాలన అనుమతులు, టెండర్ల నిర్వహణపై జిల్లాల వారీగా ఆయన సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో అన్నింటా వరంగల్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న జిల్లా ఎస్ఈ వి.పద్మారావుకు కితాబిచ్చారు. 899 చెరువుల అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపటం ద్వారా చెరువుల అంచనాల తయారీలో అత్యధిక శాతంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉన్నారని ఎస్ఈని అభినందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తర్వాత నిజామాబాద్, ఖమ్మం జిల్లాలు రెండు, మూడో స్థానంలో ఉన్నట్లు తెలిసింది.
