హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఖాతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) స్తంభింపచేసిన విషయంలో తెలంగాణ ...

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఖాతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) స్తంభింపచేసిన విషయంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కౌంటర్ దాఖలు చేసిన తరువాతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగం గా ఖాతా స్తంభనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖ లు చేయాలని టీ ఉన్నత విద్యా మండలిని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి లేఖ ఆధారంగా తమ బ్యాంకు ఖాతాను ఎస్బీహెచ్, శాంతినగర్ శాఖ స్తంభింప చేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యా మండలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ భట్టీ, గురువారం మరోసారి విచారించారు. ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, ఎస్బీహెచ్ తరఫున మదన్ మోహన్‌రావు తమ తమ వాదనలను వినిపించారు. ముందుగా వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, బ్యాంకు ఖాతా స్తంభింపచేసే ముందు ఎస్బీహెచ్ తమకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఏకపక్షంగా చేయడం వల్ల జీతాలు, పెన్షన్ల చెల్లింపు కష్టతరంగా ఉందని ఆయన కోర్టుకు వివరించారు. పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీహెచ్ వ్యవహరించిందన్నారు.
ఈ వాదనలతో రామకృష్ణారెడ్డి విభేదించారు. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో కొన్ని హైదరాబాద్‌లో ఉన్నాయని, వాటిపై తమకు హక్కు ఉందని ఆయన తెలిపారు. కాబట్టి ఏపీ ఉన్నత విద్యా మండలి ఖాతాలో ఉన్న డబ్బు తమదేనని, దానిని వాడుకునే హక్కు చట్ట ప్రకారం తమకే ఉందని, అందువల్లే ఖాతా స్తంభనకు లేఖ రాశామని ఆయన వివరించారు. చట్ట ప్రకారం తాము తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. తరువాత మదన్మోహన్రావును పిటిషనర్ బ్యాంకు ఖాతాను ఏ నిబంధనలను అనుసరించి స్తంభింప చేశారో చెప్పాలని న్యాయమూర్తి కోరారు. దీంతో మదన్మోహన్రావు ఎస్బీహెచ్కి టీ ఉన్నత విద్యా మండలి రాసిన లేఖను చదవి వినిపించారు.
బ్యాంకు ఖాతా విషయంలో ఇరు రాష్ట్రాలు మాదంటే మాది అంటూ వివాదం చేస్తున్నాయని, మధ్యే మార్గంగా ఖాతాను స్తంభింప చేశామని తెలిపారు. తర్వాత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీ ఉన్నత విద్యా మండలికి ఆంధ్రా బ్యాంకులో కావాల్సిన డబ్బు ఉందని, ఖాతా స్తంభన వల్ల వారికొచ్చిన నష్టమేమీ లేదని తెలిపారు. అంతేకాక ఈ దశలో ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, మూడు నాలుగు రోజుల్లో రామకృష్ణారెడ్డి కౌంటర్ దాఖలు చేస్తామని చెబుతున్నారు కాబట్టి, దీనిపై స్పందన ఏమిటని వేణుగోపాల్‌ను అడిగారు. కౌంటర్ దాఖలుకు అభ్యంతరం లేదని వేణుగోపాల్ చెప్పడంతో, ఆ మేర న్యాయమూర్తి కౌంటర్ దాఖలుకు గడువునిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.