ఎములాడ ఆలయ పాలన అస్తవ్యస్తం కార్యనిర్వహణాధికారి స్థాయి ఆర్జేసీ కేడర్ ప్రస్తుతం ఉన్నది అసిస్టెంట్ కమిషనర్ అధికారాల విభజన లేక అంతా ఇష్టార...

కార్యనిర్వహణాధికారి స్థాయి ఆర్జేసీ కేడర్
ప్రస్తుతం ఉన్నది అసిస్టెంట్ కమిషనర్
అధికారాల విభజన లేక అంతా ఇష్టారాజ్యం
రూ.కోట్ల టర్నోవర్ ఉన్నా అకౌంటెంట్ లేడు
కాగ్ అక్షింతలు వేసినా మారని ఆడిట్ తీరు
వేములవాడ అర్బన్: తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయంగా పేరున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో పాలన గాడితప్పిందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అధికారుల మధ్య సమన్వయలోపం, ఉద్యోగుల్లో గ్రూపు రాజకీయాలు వెరసి పాలన పక్కదారి పట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 6(ఏ) ఆలయాల్లో ఒకటైన వేములవాడ దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి(ఈవో)గా రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) స్థాయి అధికారిని నియమించారు. ఇటీవల కాలంలో అధికారుల విభ జన ప్రక్రియ ముందుకు సాగకనో లేక దేవాదాయశాఖలో ఉన్నతాధికారులు లేకనో తలియదు కానీ.. ఆర్జేసీ కేడర్‌తో పనిచేస్తున్న ఈ దేవస్థానం ఈవో స్థాయిని అసిస్టెంట్ కమిషనర్ హోదాకు తగ్గించేశారు. మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం సాధించకపోతే భక్తులకు ఇబ్బందులు తప్పదు.
అధికారాల విభజన ఏది?
ఆలయంలో ఈవో తర్వాతి పోస్టు ఏఈవోలు. ఇక్కడ నలుగురు ఏఈవోలు విధులు నిర్వహిస్తుంటారు. స్థానాచార్యుల తర్వాత ఏఈవో ర్యాంకులతో సమానంగా ప్రధాన అర్చకులు నలుగురు ఉన్నారు.కానీ ఏఈవోల మాదిరిగా అధికార వికేంద్రీకరణ చేపట్టకపోవడంతో అర్చకుల్లో అసంతృప్తి నెలకొందన్న చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఒక వ్యక్తిపైనే పూర్తిస్థాయి బాధ్యతలు నెట్టడం వల్ల పూజాపరమైన కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని, తద్వారా కిందిస్థాయి అర్చకులు, పరిచారకులు సమన్వయంతో పని చేయలేకపోతున్నారనే వాదనలు బలంగా వినవస్తున్నాయి. ఈ క్రమంలో అర్చకుల విధులు, బాధ్యతల విభజన జరిగితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇష్టారాజ్యంగా విధులు
రాజన్న ఆలయంలో 414 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు 280 మంది, కాంట్రాక్టు ఉద్యోగులు 55, ఫిక్స్డ్ పే ఉద్యోగులు 12, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 71, డేలివేజ్ ఉద్యోగులు 14, రెమ్యునరేషన్ పే ఉద్యోగులు ఏడుగురు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారన్న విషయం అధికారులకు, సహోద్యోగులకు సైతం తెలియకుండా ఇక్కడి పాలన సాగుతోంది. సెలవుపై ఎవరైనా వెళితే వారి స్థానంలో ఇంకొకరిని డిప్యూట్ చేస్తారు. సెలవు నుంచి తిరిగి వచ్చిన ఉద్యోగి ఎక్కడ విధులు నిర్వహించాలో సూచించరు. దీంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సొంత పనులను చక్కదిద్దుకుంటున్నారు. ఇక లాంగ్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల విషయం ఎవరికీ పట్టదు. ఇటీవల ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ సూపరింటెండెంట్, మరో ఇన్స్‌స్పెక్టర్ సెలవు పెట్టి తిరిగి ఉద్యోగంలో చేరారు. వారు ఎక్కడ పని చేయాలో అధికారులు ఇప్పటి వరకు సూచించకపోవడంతో వారు అటూ ఇటూ తిరుగుతూ టైంపాస్ చేస్తున్నట్టు తెలిసింది.
నివేదన తీసుకెళ్లడం నామోషే..
దేవస్థానంలో పని చేస్తున్న అర్చకులు, పరిచారకులు తమ విధుల నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం ప్రధానాలయంలో స్వామి వారికి నివేదన సమర్పించిన అనంతరం అనుబంధ దేవాలయాల్లోని స్వామివారలకు సైతం నివేదన సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నివేదన మంటపం నుంచి ఆయా దేవాలయాలకు నివేదనను తీసుకెళ్లేందుకు అర్చకులు, పరిచారకులు నామోషిగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనుబంధ దేవాలయాల్లో నివేదన సరైన వేళలకు జరగడం లేదంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే అని చెప్పక తప్పదు.
రూ.కోట్ల ఆదాయమున్నా అకౌంటెంట్ లేడు...
రాజన్న ఆలయానికి ఏడాదికి రూ.70 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. కానీ అకౌంట్స్ విభాగంలో అకౌంటెంట్ లేకపోవడం గమనార్హం. నిత్యం లక్షలు, కోట్లలో టర్నోవర్ జరిగే ఈ విభాగంలో ఏఈవో స్థాయి అధికారితోపాటు అరకొర సిబ్బందితో అకౌంట్స్ నిర్వహిస్తున్నారు. స్వామి వారికి వచ్చే రాబడి, జమ, ఖర్చులకు సంబంధించిన అంశాలను చూసే ఈ సెక్షన్‌పై అధికారులు ఇంతటి చిన్నచూపు ఎందుకో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో అకౌంట్స్ నిర్వహణ సాగుతున్నట్లు సమాచారం. అకౌంట్స్‌కు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే ఏ ఉద్యోగి బలైపోతాడోనన్న భయం ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బందిని వేధిస్తోంది.
కాగ్ అక్షింతలు వేసినా మారని ఆడిట్ విభాగం
ఇటీవల జిల్లాలో పర్యటించిన కాగ్ బృందం వేములవాడ రాజన్న ఆలయ అకౌంట్స్ సక్రమంగా లేవని అక్షింతలు వేసినా ఇక్కడి ఆడిట్ విభాగంలో ఎలాంటి మార్పులు రాలేదు. కోట్లాది రూపాయల బిల్లులకు అభ్యంతరాలు వస్తున్నా... వాటికి సమాధానాలే రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించిన రాజన్న ఆలయ పాలనను చక్కదిద్దాల్సిన అవసరముంది.