-నంబర్ప్లేట్ల కోడ్ మార్పుపై త్వరలోనే నిర్ణయం -ఆన్లైన్ లేదా మీ సేవ ద్వారా మార్పు సులువు -విధివిధానాలు ఖరారుచేస్తున్న రవాణాశాఖ ...
-నంబర్ప్లేట్ల కోడ్ మార్పుపై త్వరలోనే నిర్ణయం
-ఆన్లైన్ లేదా మీ సేవ ద్వారా మార్పు సులువు
-విధివిధానాలు ఖరారుచేస్తున్న రవాణాశాఖ
హైదరాబాద్,: న్యాయపరమైన అభ్యంతరాల నేపథ్యంలో అభిప్రాయాల పరిగణన అనంతరం.. రాష్ట్రంలో ఏపీ పేరుతో చలామణిలో ఉన్న వాహనాల నంబర్ప్లేట్ల కోడ్‌ను టీఎస్ (తెలంగాణ స్టేట్) పేరుతో మార్చుకోవడానికి ప్రభుత్వం త్వరలో ఆదేశాలు ఇవ్వనుంది. రవాణాశాఖతోపాటు మీ సేవ ద్వారా వాహనాల నంబర్ప్లేటుపై ఉన్న కోడ్‌ను టీఎస్‌గా మార్చుకునేలా సులభమైన ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నది. దీనికోసం అవసరమైన విధివిధానాలను ఖరారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విదివిధానాలు తయారైన వెంటనే ఉత్తర్వులు జారీచేసి టీఎస్ నంబర్ప్లేట్లను అమలుచేయనున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రజలు, వాహనదారులు లేవనెత్తిన అభ్యంతరాలను తెలంగాణ న్యాయశాఖ పరిశీలిస్తున్నది.
పరిశీలన పూర్తయి న్యాయశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశముంది. రాష్ట్రం ఏర్పడిన మొదటినెలలో తెలంగాణ రాష్ట్ర కోడ్ ప్రతిబింబించేలా ఏపీ స్థానంలో టీఎస్ కోడ్‌ను నాలుగునెలల్లోగా ఏర్పాటు చేసుకోవాలని ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై రాంమోహన్చౌదరి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనివల్ల వాహనదారులపై ఆర్థికభారం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం.. తాము విడుదల చేసింది కేవలం ప్రాథమిక ఉత్తర్వులు మాత్రమేనని, అందరి అభిప్రాయాలను పరిగణిస్తామంటూ ధర్మాసనానికి విన్నవించింది. అనంతరం అభిప్రాయాలు కోరుతూ రవాణాశాఖ నోటిఫికేషన్ జారీచేయగా స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. కేవలం ఐదు అభిప్రాయాలు మాత్రమే రాగా, వాటిని న్యాయశాఖ పరిశీలిస్తున్నది.
-ఒక్క క్లిక్‌తో వాహనాల కోడ్ టీఎస్‌గా మార్పు
తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఏపీ పేరుతో నమోదై తిరుగుతున్న వాహనాలు 73 లక్షల వరకున్నాయి. వాహనదారులు దరఖాస్తు చేసుకుంటే చాలు ఒక్క క్లిక్‌తో నంబర్ప్లేట్లను టీఎస్‌గా మార్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఉంచారు. వాహనదారుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే క్షణాల్లో కోడ్ మారిపోతుంది. దానికి సంబంధించిన రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఈ పత్రాన్ని జేబులో ఉంచుకుని, టీఎస్ పేరుతో తయారుచేసిన హైసెక్యూరిటీ నంబర్ ప్లేటును వాహనానికి బిగించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానం తెలియనివారికోసం రవాణాశాఖ కార్యాలయాల్లో సిబ్బందితోపాటు, మీ సేవ ద్వారా సేవలందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
