(24 Mar) ఖమ్మం, మార్చి 23: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె చంద్రశేఖర్‌రావు సుమారు తొమ్మిది నె...
(24 Mar) ఖమ్మం, మార్చి 23: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె చంద్రశేఖర్‌రావు సుమారు తొమ్మిది నెలల తర్వాత ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. గత ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగా అదే రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించిన ఆయన ఖమ్మం జిల్లాలో మాత్రం పర్యటించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో బలంగా లేకపోవటంతో పాటు పలు కారణాలరీత్యా ఆయన పర్యటన జరగలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 26, 27, 28వ తేదీల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. 26వ తేదీ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌ను నుంచి నేరుగా ఖమ్మం చేరుకొని నగరంలోని ప్రజల పరిస్థితులను పరిశీలించనున్నారు. 27వ తేదీన ఖమ్మం నగరంలోని మురికివాడల్లో పర్యటించి ప్రజల ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేయనున్నారు. కాగా ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో పర్యటించనున్న కెసిఆర్‌కు ఘన స్వాగతం చెప్పేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ లోపుగానే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని తద్వారా వెనుకబడిన వారిని ప్రభుత్వం గుర్తించటం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఓటర్ల నానుడి పట్టుకోలేకపోయిన ఆయా పార్టీల కార్యకర్తలు, శ్రేణులు ఎవరికి వారే తమకు మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ పర్యటనలో భాగంగా 1800మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న తొలి సీతారాముల కల్యాణానికి కూడా ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆయన జిల్లాకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
