Gudumba making File Photo ఖానాపురం హవేలి, మార్చి 25: జిల్లాలో ఐబి, సారా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చ...
![]() |
| Gudumba making File Photo |
ఖానాపురం హవేలి, మార్చి 25: జిల్లాలో ఐబి, సారా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీం, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మహేష్‌బాబుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలంబరిది మాట్లాడుతూ జిల్లాలో సారా తయారీ, విక్రయాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఇందుకోసం పోలీస్, ఎక్సైజ్ పోలీసులు సిబ్బందిని నియమించి అక్రమ సారాపై దృష్టి సారించాలన్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు, ఇతర వర్గాలు సమాచారం అందిస్తే వెంటనే టాస్క్‌ఫోర్స్ బృందాలు ఎక్సైజ్ స్టేషన్లతో సంబంధం లేకుండా నేరుగా నిర్ధేశించిన ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. అక్రమ సారాపై ప్రజలు సమాచారాన్ని అందించేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టరేట్లోని సాంకేతిక తహశీల్దార్ ఖాసీంను ఆదేశించారు. ఆ నెంబర్‌కు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచటం జరుగుతుందన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు మాత్రమే సంబంధాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ షానవాజ్ ఖాసీం మాట్లాడుతూ సారా అక్రమంగా సారా తయారీ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
