ఇరుకుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించిన ఎస్ఐ కౌడిపల్లిః ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రేమజంట అమ్మాయి కుటుంబ సభ్యులనుండి రక్షణ కల్పించాలని ...

కౌడిపల్లిః ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రేమజంట అమ్మాయి కుటుంబ సభ్యులనుండి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరుకుటుంబాల సభ్యులను పిలిపించి ఆదివారం ఎస్ఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రేమజంట వివరాల ప్రకారం.. కౌడిపల్లి మండలం చిలిప్‌చెడ్ పంచాయితీ శిలాంపల్లికి చెందిన సంగు కొండల్ (23), నర్సాపూర్ మండలం కాగజ్మద్దుర్కి చెందిన బోగ సునీత (21) ఐదేళ్లుగా ప్రేమించుకుంటు న్నారు.
వీరిద్దరు నర్సాపూర్‌లోని ఓప్రైవేటు కళాశాలలో చదువుతుండగా ప్రేమలో పడ్డారు. కాగా వీరిప్రేమవిషయం ఇరుకుటుంబాల్లో తల్లిదండ్రులకు తెలిపారు. అబ్బాయి కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోగా అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం ఒప్పుకున్నట్లు చెప్పి.. మరోవ్యక్తితో పెళ్లిచేసేందుకు సంబంధాలు చూడటం ప్రారంభించారు. పలుమార్లు సునీత కుటుంబసభ్యులు కొండల్‌పై దాడిచేసేందుకు ప్రయత్నించారు. ఇరవైరోజుల క్రితం సునీత మేనమామలు శిలాంపల్లివచ్చి కొండల్ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.
కాగా ఈనెల11న ప్రేమికులిద్దరూ ఇంట్లోనుంచి వెళ్లిపోయి 13న నిజామాబాద్ జిల్లా జానకంపేటలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నారు. తర్వాత ప్రేమికులిద్దరూ శనివారం రాత్రి కౌడిపల్లి ఎస్ఐ సైదేశ్వర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ ఆదివారం ఇరుకుటుంబాలకు సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు గ్రామపెద్దలతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు.
ఇరువురి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులవెంట సునీతవస్తే తీసుకుపోవచ్చని తెలిపారు. కాగా సునీత తనభర్త కొండల్తోనే ఉంటానని చెప్పడంతో అమ్మాయి కుటుంబసభ్యులు వెనుతిరిగారు. కాగా ప్రేమికులిద్దరూ మేజర్లుకావడంతో పెళ్లిచేసుకున్నారని.. అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరికీ హానితలపెట్టవద్దని ఎస్ఐ హెచ్చరించారు