Singareni Logo - ఖండాంతరాలకు విస్తరించనున్న ఖ్యాతి - విదేశీ కోల్బ్లాక్లపై సీఎండీ ప్రత్యేక దృష్టి - ఏప్రిల్‌లో గ్లోబల్ టెండర్లలో...
![]() |
| Singareni Logo |
- ఖండాంతరాలకు విస్తరించనున్న ఖ్యాతి
- విదేశీ కోల్బ్లాక్లపై సీఎండీ ప్రత్యేక దృష్టి
- ఏప్రిల్‌లో గ్లోబల్ టెండర్లలో పాల్గొననున్న సంస్థ
హైదరాబాద్: తెలంగాణ సిరి సింగరేణి అంతర్జాతీయ మార్కెట్లో అడుగిడుతున్నది. వందేండ్లకుపైగా పైగా చరిత్ర కలిగి.. దేశీయ బొగ్గు ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న సింగరేణి వాణిజ్యపరంగా, వ్యాపార విస్తరణలో భాగంగా విదేశీ బొగ్గు గనులపై దృష్టిసారించింది. సింగరేణికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలన్న సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాల్లో కోల్బ్లాక్లపై అధ్యయనం చేసింది. అది ఇచ్చిన నివేదిక ఆధారంగా విదేశీ కోల్‌బ్లాక్‌లను సొంతం చేసుకునేందుకు ఏప్రిల్ నెలలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) గ్లోబల్ టెండర్‌ను ప్రకటించేందుకు సింగరేణి సిద్ధం అవుతున్నది. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలోని కోల్‌మైన్స్‌ను సింగరేణి సంస్థే సొంతగా నిర్వహించుకోవాలా? లేక ఇప్పటికే కొన్ని కంపెనీలతో జాయింట్ వెంచర్ కంపెనీ(జేవీసీ)లతో భాగస్వామ్యం కావాలా? అనే అంశాలపై సమాలోచనలు జరుపుతున్నది.
ఈవోఐ గ్లోబల్ టెండర్ అంశంపై నెలాఖరులో సింగరేణి బోర్డు సమావేశం నిర్ణయం తీసుకోనున్నది. తెలంగాణ నాలుగు జిల్లాల్లో సింగరేణికి 48 మైనింగ్‌లు ఉన్నప్పటికీ వాటిల్లో కేవలం 13 మైనింగ్‌లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. దీంతో ఉత్పత్తి వ్యయం ఎక్కువ ఉంటున్నది. కోల్ ఇండియా, విదేశీ బొగ్గు దిగుమతులు సింగరేణి ఉత్పత్తి వ్యయంకంటే తక్కువగా ఉండడం విశేషం. ఈ అంశంపై సింగరేణి యాజమాన్యం లోతుగా అధ్యయనంచేసింది. సింగరేణి సంస్థకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం కూడా ఎంతో అవసరమని భావిస్తున్నది. ప్రస్తుతం సింగరేణి తనకు ఉన్న వినియోగదారులకు పూర్తిస్థాయిలో, నాణ్యమైన బొగ్గును అందిస్తున్నది.
అయితే వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలో ఏర్పాటు కానున్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన బొగ్గును అందించే బాధ్యత కూడా సింగరేణిదే. ప్రస్తుతం సింగరేణి 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తులను సాధిస్తున్నది. విద్యుత్ ప్రాజెక్టులకు అదనంగా ఏటా 40 మిలియన్ టన్నుల బొగ్గు అవసరాలు తీర్చే బాధ్యత సింగరేణి సంస్థపైనే ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ బొగ్గు ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయంలో యాజమాన్యం నిర్థారణకు వచ్చింది. ఆ దిశగా గత రెండు నెలలుగా సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక దృష్టిసారించారు.
