-రెండు బ్యాంకులకు 62 కోట్లు బకాయి -డిమాండ్ నోటీసుకు స్పందించని యాజమాన్యం -7.25 ఎకరాల స్థలం స్వాధీనం బంజారాహిల్స్, :టాలీవుడ్లో ...
-రెండు బ్యాంకులకు 62 కోట్లు బకాయి
-డిమాండ్ నోటీసుకు స్పందించని యాజమాన్యం
-7.25 ఎకరాల స్థలం స్వాధీనం
బంజారాహిల్స్, :టాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ స్టూడియో బ్యాంక్ బకాయిదారుల చిట్టాలో చేరింది. తీసుకున్న రుణాన్ని సరైన సమయంలో చెల్లించకపోవడం, బ్యాంకులు ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్‌కు చెందిన ఏడు ఎకరాల 25 గుంటల స్థలాన్ని జప్తు చేశారు. స్వాధీనం చేసుకున్న స్థలానికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరుపరాదని ఆదేశించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సెవెన్ ఎకర్స్ స్టూడియో విస్తరణ కోసం అక్కినేని కుటుంబం ఆంధ్రాబ్యాంకు నుంచి 32.3 కోట్లు, ఇండియన్ బ్యాంకు నుంచి 29.7కోట్లు రుణంగా తీసుకుంది. అయితే వీటిని సకాలంలో తిరిగి చెల్లించలేదు. దీంతో బకాయిపై 2014 జనవరి 2న బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసులను జారీచేశారు.
వాటికి రుణగ్రహీతలు, తనఖాదారులు స్పందించకపోవడంతో సోమవారం స్టూడియో వద్దకు చేరుకున్న ఆయా బ్యాంకుల అధికారులు స్టూడియోకు చెందిన ఆస్తులను జప్తు చేయడానికి నోటీసులు జారీ చేశారు. రుణగ్రహీతల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఎండీ నాగార్జునరావు అక్కినేని, వెంకట్ నారాయణరావు అక్కినేని, సంస్థ డైరెక్టర్లు వై సుప్రియ, నిమ్మగడ్డ ప్రసాద్, నాగసుశీల, వెంకటేశ్ రొడ్డం ఉన్నట్లు వారు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో బ్యాంకు అధికారులతో అక్కినేని కుటుంబీకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.