(24 Mar) ఖానాపురం హవేలి, మార్చి 23: ఈ నెల 25వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు గాను సంబంధిత అధికారులు ఏర్పాట్లు...
(24 Mar) ఖానాపురం హవేలి, మార్చి 23: ఈ నెల 25వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు గాను సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది 40,143మంది విద్యార్థులు పదో పరీక్షలు రాయగా, ఈ ఏడాది 37,193మంది మాత్రమే రాయనున్నారు. దీంతో 2,950మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు తగ్గినట్లయింది. ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న పరీక్షలకు గాను సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 181పరీక్షా కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 181చీఫ్ సూపరింటెండెంట్లు, 181మంది డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు 1,860మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొననున్నారు. కాగా పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144సెక్షన్ విధించటంతో పాటు ఆయా ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను కూడా మూసివేయనున్నారు. పరీక్ష విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్, లైటింగ్, తాగునీటి సరఫరా లాంటి వసతులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. అన్ని కేంద్రాల వద్ద విస్తృతమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పెరిగిన పరీక్షా సమయం గతంలో పదో తరగతి పరీక్ష సమయం 2-30గంటలు ఉండగా, ఈ ఏడాది సిలబస్‌లో మార్పు రావటంతో 15నిమిషాల సమయాన్ని పెంచారు. హిందీ పరీక్షకు మాత్రం అర్ధగంట సమయాన్ని అదనంగా కేటాయించారు. కాగా ప్రైవేటు విద్యార్థులకు మాత్రం యథావిధిగానే పాత సమయం ఉంటుంది. అదనంగా కేటాయించిన పదిహేను నిమిషాల సమయం పరీక్షా పేపర్ చదువుకునేందుకు ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. మారిన మోడల్ కారణంగా అదనపు సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం : డిఈఓ రవీంధ్రనాథ్‌రెడ్డి పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు డిఈఓ రవీంధ్రనాథ్‌రెడ్డి తెలిపారు. 1పరీక్ష సమయంలో ఆయా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు, ఫర్నిచర్, తాగునీటి వసతి సౌకర్యాలను కల్పించామని వెల్లడించారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
