బోగస్ ఓటర్లను ఏరివేయాలన్న లక్ష్యం జిల్లాలో సకాలంలో సాకారం అయ్యేలా కనిపించడంలేదు. ఓటరు కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానించి ఒకే వ్యక్తి ...
బోగస్ ఓటర్లను ఏరివేయాలన్న లక్ష్యం జిల్లాలో సకాలంలో సాకారం అయ్యేలా కనిపించడంలేదు. ఓటరు కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానించి ఒకే వ్యక్తి ఒకే ఓటు ఉండేలా చూడాలన్న ఎన్నికల సంఘం ఆలోచన కార్యరూపం దాల్చడంలో తీవ్ర జాప్యం అనివార్యం కానుంది. ఓటరుకు ఆధార్ అనుసంధానం గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది. మరో రెండు రోజులే మిగిలి ఉండగా.. ఆధార్ అనుసంధానం 30 శాతమే పూర్తయింది. ఈ విషయమై ఇటీవల పాలనాధికారి జగన్మోహన్ తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.జిల్లాలో ప్రస్తుతం 19,71,210 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 9,84,075 మంది, పురుష ఓటర్లు 9,86,929 మంది, ఇతరులు 206 మంది ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో 28,24,953 మంది జనాభా ఉన్నారు. నిబంధనల ప్రకారం జనాభాలో 60 శాతం మంది మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఈ లెక్కన జిల్లాలో లక్షకుపైగా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇలాంటి వారంతా నకిలీ ఓటర్లేనని ఎన్నికల సంఘం భావిస్తోంది. బోగర్ ఓటర్లను తొలగించడంతో పాటు ఒకరి ఓటు మరొకరు వేయకుండా ఆధార్ అనుసంధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావించిన ఎన్నికల సంఘం అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఓటుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ నత్తను తలపిస్తోంది. శుక్రవారం నాటికి 30 శాతం మేర ఓటు అనుసంధాన ప్రక్రియ పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. శనివారం శ్రీరామనవమి, ఆదివారం సెలవు కావడంతో బూత్‌స్థాయి అధికారులు ఇంటి నుంచి బయట అడుగు పెట్టలేదు. మిగిలిన 70 శాతం ఓటు అనుసంధానం రెండు రోజుల్లో పూర్తకావడం అసాధ్యమని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. గడువు పొడిగిస్తేనే ఎన్నికల సంఘం లక్ష్యం నెరవేరుతుందని అధికార వర్గాలు చెబుతుండగా.. మరోవైపు ఆధార్ అనుసంధానంపై ప్రజల్లో అనుకున్న విధంగా ప్రచారం చేయకపోవడం కూడా నమోదు ప్రక్రియ నత్తనడకకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇంటింటి సర్వే ద్వారా 2,295 మంది ఓటర్లు నకిలీలుగా తేలారు. మరో 2,484 మంది ఓటర్లు చనిపోయినా ఓటరు జాబితాలో కొనసాగుతున్నట్లు గుర్తించారు. వారిని జాబితా నుంచి తొలగించారు. మరో 298 మందిని వివిధ కారణాలతో తొలగించారు. ఇంటింటి సర్వేతో పాటు చరవాణి, మెసేజ్, కాల్‌సెంటర్లు, ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా ఓటర్లు స్వయంగా తమ ఓటును ఆధార్‌కు అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రచారం చేయలేకపోయింది. అయినా కొందరు సొంతంగా తమ ఓట్లను ఆధార్‌కు అనుసంధానం చేసుకున్నారు. ఆయా మాధ్యమాల ద్వారా 6,341 మంది తమ పేర్లను ఆధార్‌కు అనుసంధానం చేసుకున్నట్లు అధికారుల వద్ద ఉన్న సమాచారం ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద పాలనాధికారి మరోమారు తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేయడమో.. లేదా గడువు పెంచేలా ఎన్నికల సంఘానికి నివేదించడమో చేస్తేగాని ఆధార్ అనుసంధాన ప్రక్రియ జిల్లాలో విజయవంతమయ్యేలా కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
